మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలే బీసీ హక్కుల పోరాటానికి ప్రేరణ: గుజ్జ సత్యం
- యువతలో పూలే ఆలోచనలు విస్తరించాలి.

హైదరాబాద్, ఏప్రిల్ 11: సామాజిక దాస్యం నిర్మూలనకు ముందుగానే పోరాటం చేయాలని స్పష్టంగా పేర్కొన్న ఆధునిక తొలి సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ, రాజకీయ స్వేచ్ఛ సాధించిన తర్వాత కూడా దేశంలో సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. “రాజకీయ దాస్యం కంటే సామాజిక దాస్యమే ప్రమాదకరం” అని శతాబ్దం క్రితమే పూలే చెప్పిన మాటలు నేటి పరిస్థితుల్లో మరింత ప్రాసంగికమయ్యాయని ఆయన అన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు ఆత్మగౌరవం, విద్య, హక్కులపై అవగాహన కల్పించడం ద్వారా సమాజాన్ని మేల్కొలిపిన మహనీయుడు పూలే అని కొనియాడారు.
సామాజిక సమానత్వం, హేతుజ్ఞానం, న్యాయం అనే మూల సూత్రాలపై ఆధారపడి సమసమాజ స్థాపన కోసం పూలే జీవితాంతం పోరాడారని గుజ్జ సత్యం వివరించారు. మహిళల విద్య, బీసీల హక్కులు, రైతుల సమస్యలపై వందేళ్ల క్రితమే గొంతెత్తిన దూరదృష్టి గల నాయకుడు పూలే అని గుర్తుచేశారు. ఆధునిక భారతదేశంలో అణగారిన వర్గాలకు, మహిళలకు ఒక కొత్త దిశను చూపించిన తొలి మహాత్మా ఆయనే అని పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ బలపడుతున్న నేపథ్యంలో, పూలే ఆలోచనలు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై జరుగుతున్న చర్చలు, కేంద్ర స్థాయిలో ఓబీసీ రాజకీయ ప్రతినిధిత్వంపై పెరుగుతున్న ఒత్తిడి, పూలే ఆశయాలకు ప్రతిబింబమని అభిప్రాయపడ్డారు.
విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో బీసీలకు సముచిత వాటా కల్పించకపోతే సామాజిక న్యాయం సాధ్యం కాదని గుజ్జ సత్యం స్పష్టం చేశారు. “సమానత్వం కోసం పోరాటం ఇంకా పూర్తికాలేదు. పూలే చూపిన మార్గంలోనే మన పోరాటం కొనసాగాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
అలాగే, సమాజంలో పెరుగుతున్న కుల వివక్ష, విద్యా రంగంలో అసమానతలు, మహిళలపై వివక్ష వంటి సమస్యలను అధిగమించడానికి సమగ్ర విధానాలు అవసరమని పేర్కొన్నారు. కేవలం చట్టాలు సరిపోవని, అవగాహనతో కూడిన సామాజిక ఉద్యమం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
“మహానుభావులను స్మరించడం మాత్రమే కాదు, వారి ఆశయాలను ఆచరణలో పెట్టడం నిజమైన నివాళి” అని గుజ్జ సత్యం అన్నారు. పూలే ఆలోచనలను యువతలో విస్తరింపజేసి, సమానత్వం కోసం సుదీర్ఘ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ రఘురాం, బీసీ నాయకులు చామకూర రాజు, కె.వి గౌడ్ రినాథ్, జల్లేపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

