NewsPolitics

ఫీజు రీయింబర్స్మెంట్ ‌హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేయాలి : బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

  • హైకోర్టు తీర్పుపై ఫుల్ బెంచ్ అప్పీల్ అవసరం
  • లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు సందిగ్ధం

సత్య తెలంగాణ హైదరాబాద్, ఏప్రిల్ 30: ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేయాలని సూచించిన హైకోర్టు తీర్పు సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 12.50 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి ఉన్నారని, ఈ పథకం బలహీనపడితే వేలాది కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతాయని హెచ్చరించారు.

ప్రభుత్వం తక్షణమే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి, ఫుల్ బెంచ్‌కు అప్పీల్ చేయాలని డిమాండ్ చేశారు. “విద్య హక్కు… అది ధనవంతులకే పరిమితం కాకూడదు. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం ప్రభుత్వ బాధ్యత” అని గుజ్జ సత్యం స్పష్టం చేశారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయని, ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగితే ఉద్యమాలు ఉధృతమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని క్రమంగా ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తన వైఖరిని వెంటనే మార్చుకోవాలని సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయని, ఆలస్యం చేయకుండా చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని గుజ్జ సత్యం కోరారు.