News

జూబ్లీహిల్స్–బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు:

సత్య తెలంగాణ ఫిబ్రవరి 28: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాసుల పనులకు శుక్రవారం ముగ్ధా జంక్షన్ వద్ద భూమిపూజ నిర్వహించారు. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ప్రారంభం నేపథ్యంలో శనివారం నుంచి ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.

నిర్మాణ పనుల సమయంలో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా సాగర్ సొసైటీ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ గేట్–1, ముగ్ధా జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.

ప్రధాన ట్రాఫిక్ మళ్లింపులు ఇలా ఉన్నాయి:

  • బంజారాహిల్స్ రోడ్ నెం.1 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలు రోడ్ నెం.10 క్యాన్సర్ హాస్పిటల్ – అగ్రసేన్ ఐలాండ్ – భారతీయ విద్యా భవన్ మార్గం ద్వారా వెళ్లాలి.
  • మాసబ్ ట్యాంక్ నుంచి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లేవారు విరించి హాస్పిటల్ – రోడ్ నెం.12 జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ మీదుగా ప్రయాణించాలి.
  • NFCL నుంచి శ్రీనగర్ కాలనీ, సాగర్ సొసైటీ, ఇందిరానగర్, లేబర్ అడ్డా మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ చేరుకోవాలి.
  • జూబ్లీహిల్స్ రోడ్ నెం.36/45 నుంచి NFCL వైపు వెళ్లే వాహనాలు ఇందిరానగర్, శ్రీరామ్ నగర్ కాలనీ మార్గాన్ని ఉపయోగించాలి.

నిర్మాణ పనుల కారణంగా ప్రయాణ సమయం పెరిగే అవకాశమున్నందున వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. రద్దీ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *