ఫీజు రీయింబర్స్‌మెంట్ సంక్షోభం: బీసీ విద్యార్థుల చదువులతో చెలగాటం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దానికి పైగా గడిచింది. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అనే నినాదాలు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో వినిపిస్తున్నాయి. కానీ నేలమీద పరిస్థితులను పరిశీలిస్తే వెనుకబడిన వర్గాల (బీసీ) విద్యార్థుల పరిస్థితి మాత్రం ఆందోళన కలిగించేలా ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న లక్షలాది మంది బీసీ విద్యార్థులు నేడు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌ల జాప్యం, పెరుగుతున్న విద్యా ఖర్చులు, ప్రభుత్వ నిర్లక్ష్యం మధ్య భవిష్యత్తుపై అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ జనాభాలో బీసీలు సుమారు 50 శాతానికి పైగా ఉన్నారని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే రాష్ట్ర భవిష్యత్తు, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ సృష్టి, సామాజిక పురోగతి అన్నీ కూడా ఈ వర్గాల విద్యాపరమైన అభివృద్ధిపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ వర్గానికి చెందిన విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా విధానం లేకపోవడం, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవలి కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య తెలంగాణ విద్యా రంగాన్ని కుదిపేసింది. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల అంచనా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన బకాయిలు రూ.9,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు పేరుకుపోయాయి. ఈ బకాయిల కారణంగా వందలాది కళాశాలలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని విద్యాసంస్థల సంఘాలు పేర్కొంటున్నాయి.
ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, రాష్ట్రంలోని 900కు పైగా ప్రొఫెషనల్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అంతేకాకుండా 2025లో దాదాపు 2,000 ప్రైవేట్ కళాశాలలు రూ.1,200 కోట్ల బకాయిల విడుదల కోసం నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చిన ఘటన తెలంగాణ విద్యా రంగ చరిత్రలో ఒక హెచ్చరికగా నిలిచింది.
ఈ సమస్య వల్ల ఎక్కువగా నష్టపోతున్నది ఎవరు? సంపన్న వర్గాల విద్యార్థులు కాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ కుటుంబాల పిల్లలే. ఫీజులు చెల్లించలేక చదువులు మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొంతమంది విద్యార్థులు విద్యా రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే, మరికొందరు కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం మోపాల్సి వస్తోంది.
ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వ బకాయిల కారణంగా కళాశాలలు నేరుగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దీని అర్థం ఏమిటంటే, ప్రభుత్వ వైఫల్యానికి మూల్యం చెల్లించాల్సి వస్తున్నది పేద మరియు మధ్యతరగతి విద్యార్థులే.
విద్యా హక్కు రాజ్యాంగబద్ధమైన అంశం. కానీ తెలంగాణలో అది నేడు కుటుంబ ఆర్థిక స్థితిపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది. బీసీ విద్యార్థుల్లో చాలా మంది రైతు కుటుంబాలు, కూలీ కుటుంబాలు, చిన్న వ్యాపార కుటుంబాలకు చెందినవారు. పెరుగుతున్న ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, లా, మేనేజ్‌మెంట్ కోర్సుల ఫీజులు వారికి భారంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో అందకపోవడం వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది.
ఇంకో కీలక అంశం బీసీ విద్యార్థుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపుల కొరత. ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో భారీ ప్రకటనలు కనిపిస్తున్నప్పటికీ, ఖర్చు వివరాలు పరిశీలిస్తే అనేక పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీసీ స్టడీ సర్కిళ్లు, కోచింగ్ కేంద్రాలు, విదేశీ విద్య పథకాలు, పరిశోధన ప్రోత్సాహకాలు అవసరమైన స్థాయిలో విస్తరించడం లేదు.
దేశంలో కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ గ్రామీణ బీసీ విద్యార్థుల్లో డిజిటల్ యాక్సెస్ ఇప్పటికీ పరిమితంగానే ఉంది. పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్, సాంకేతిక నైపుణ్యాలు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ శిక్షణ అందుబాటులో లేకపోవడం వల్ల వారు ఉద్యోగ మార్కెట్‌లో వెనుకబడుతున్నారు.
బీసీ విద్యార్థుల సమస్య కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ముగిసేది కాదు. పాఠశాల స్థాయి నుంచే డ్రాప్‌అవుట్‌లను తగ్గించడం, గురుకులాల సంఖ్య పెంచడం, ఉన్నత విద్యలో ప్రత్యేక సీట్లు, విదేశీ విద్యా అవకాశాలు, పోటీ పరీక్షల ఉచిత శిక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై సమగ్ర విధానం అవసరం.
ప్రస్తుతం రాజకీయ పార్టీలు బీసీల గురించి మాట్లాడుతున్నాయి. కానీ బీసీ విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా విధానం గురించి స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదు. జనాభాలో అతిపెద్ద వర్గానికి చెందిన విద్యార్థుల భవిష్యత్తు కేవలం ఎన్నికల హామీలకే పరిమితమైతే అది సామాజిక న్యాయానికి విరుద్ధం.
ప్రభుత్వం ఇటీవల నెలకు రూ.200 కోట్ల చొప్పున విడుదల చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిగా క్లియర్ చేసే విధానంతో ఉన్నట్టు తెలుస్తోంది అయితే ప్రకటనలకంటే అమలు ముఖ్యమని విద్యార్థులు గుర్తుచేస్తున్నారు.
తెలంగాణ భవిష్యత్తు బీసీ యువత చేతుల్లో ఉంది. అలాంటి యువత చదువుల కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధిని సంక్షేమ పథకంగా కాకుండా రాష్ట్ర అభివృద్ధి వ్యూహంగా చూడాల్సిన సమయం వచ్చింది. బీసీ విద్యార్థులకు ప్రత్యేక విద్యా విధానం, బడ్జెట్‌లో చట్టబద్ధ కేటాయింపులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల తక్షణ చెల్లింపు, ఉన్నత విద్యలో విస్తృత అవకాశాలు కల్పించినప్పుడే తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.
లేకపోతే విద్యలో పెరుగుతున్న అసమానతలు రేపటి తెలంగాణ సామాజిక, ఆర్థిక నిర్మాణాన్నే బలహీనపరిచే ప్రమాదం ఉంది.
To get more interesting news, click the link below.

