చేనేతకు టెండర్ గండం – నేతన్నల భవిష్యత్తు ప్రశ్నార్థకం – గుజ్జ సత్యం
- కార్పొరేట్ పాలసీలతో సహకార వ్యవస్థ కూల్చివేత – రుణమాఫీపై ప్రభుత్వం మౌనం…
- టెండర్ విధానం కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం…

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణలో చేనేత రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ప్రభుత్వ విధానాలు నేతన్నల జీవనాధారాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టుతున్నాయని చేనేత కార్మిక సంక్షేమ సంఘం చేనేత కార్మిక సంక్షేమ సంఘం మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం విమర్శించారు.
బాగ్ లింగంపల్లిలో చేనేత వర్గాల చైతన్య వేదిక అధ్యక్షులు చిక్క దేవదాసు అధ్యక్షతన మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరావత్ అనిల్, చెరుపల్లి సీతారాములు, కర్నాటి వెంకటేశం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ, చేనేతకు సంబంధించిన తాజా పరిణామాలను ప్రస్తావిస్తూ విశ్లేషణాత్మకంగా స్పందించారు.
రాష్ట్రంలో సుమారు లక్షకు పైగా చేనేత కార్మికులు ఉండగా, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఆరు లక్షల మందికి పైగా ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే చేనేతకు సరైన మార్కెట్, స్థిరమైన ఆర్డర్లు లేకపోవడం, ముడిసరుకు ధరలు పెరగడం, బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం వంటి సమస్యలతో నేతన్నలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన టెండర్ విధానం చేనేత రంగానికి తీవ్రమైన ముప్పుగా మారిందని ఆయన ఆరోపించారు. గతంలో ప్రభుత్వ ఆర్డర్లు నేరుగా సహకార సంఘాలకు ఇవ్వడం వల్ల కార్మికులకు ఉపాధి గ్యారంటీ ఉండేదని, కానీ ఇప్పుడు టెండర్ల ద్వారా పెద్ద కంపెనీలకు ఆర్డర్లు మళ్లడం వల్ల సహకార వ్యవస్థ బలహీనపడుతోందని అన్నారు. ఈ విధానం కొనసాగితే చేనేత వృత్తి పూర్తిగా కార్పొరేట్ ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అదే సమయంలో, చేనేత సహకార సంఘాల ఎన్నికలు దీర్ఘకాలంగా జరగకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. 2013 తర్వాత ఎన్నికలు జరగకపోవడం వల్ల సంఘాలు నిర్వీర్యంగా మారాయని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఆలస్యమైన నిర్ణయమని విమర్శించారు. ఎన్నికలు పారదర్శకంగా, రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
చేనేత కార్మికులపై పెరుగుతున్న రుణభారం కూడా ఆందోళన కలిగించే అంశమని గుజ్జ సత్యం పేర్కొన్నారు. రైతులకు ఇచ్చినట్లే చేనేత కార్మికు కూడా రుణమాఫీ ప్రకటించాలని, కనీసం రూ.2 నుండి రూ.3 లక్షల వరకు రుణభారం నుంచి విముక్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వడ్డీ మాఫీతో పాటు తక్కువ వడ్డీ రుణాలు అందించే విధానాన్ని ప్రభుత్వం తీసుకురావాలని సూచించారు.
కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, చేనేత మరియు ఇతర సంప్రదాయ వృత్తిదారులకు ఆర్థిక రక్షణ కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా గణనీయమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్, చేనేతకు ప్రత్యేక ప్యాకేజీలు వంటి అంశాలు అమలులో కనిపించడం లేదని అన్నారు.
తెలంగాణను గ్లోబల్ టెక్స్టైల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా, నేలస్థాయిలో చేనేత కార్మికుడు ఉపాధి కోల్పోతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. “మేడ్ ఇన్ తెలంగాణ” అనే నినాదం విజయవంతం కావాలంటే ముందుగా “మేడ్ బై నేతన్న”ను కాపాడాలని ఆయన స్పష్టం చేశారు.
చేనేత మరియు పద్మశాలి వర్గాలపై సమగ్ర కులవారీ జనగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ వర్గాలు గణనీయమైన శాతంలో ఉన్నప్పటికీ, ఖచ్చితమైన డేటా లేకపోవడం వల్ల పాలసీ నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతున్నాయని అన్నారు. జనగణన ద్వారా వాస్తవ పరిస్థితులు బయటపడితేనే సరైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం ముందుకు మూడు కీలక డిమాండ్లు ఉంచారు: టెండర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయడం, చేనేత కార్మికులకు రుణమాఫీ ప్రకటించడం, సహకార సంఘాల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం. ఇవి అమలు కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా చేనేత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
చేనేతను కాపాడటం అంటే కేవలం ఒక వృత్తిని కాదు, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటమేనని గుజ్జ సత్యం అన్నారు.

