NewsPolitics

ఆర్టీసీ సంక్షోభం ప్రభుత్వ వైఫల్యమే.

  • జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం 

సత్య తెలంగాణ హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి కార్మిక వర్గాన్ని కలచివేస్తోంది. ఈ పరిణామంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ప్రాణాలు కోల్పోవడం వ్యక్తిగత బలహీనత కాదని, ప్రభుత్వ విధానాల వైఫల్యానికి ఇది స్పష్టమైన సంకేతమని పేర్కొన్నారు.

కార్మికులు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడిలో ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. జీతాల బకాయిలు, అలవెన్సుల ఆలస్యం, పెరిగిన పని భారం వంటి అంశాలు కార్మికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పారు. యూనియన్లతో సమయానుకూల చర్చలు జరగకపోవడం వల్ల సమస్యలు మరింత విషమించాయని అభిప్రాయపడ్డారు.

ఎన్నికల సమయంలో ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికుల జీతాలు పెంచుతామని, బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకాలేదని గుజ్జ సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించడం కార్మికుల్లో నమ్మక సంక్షోభాన్ని పెంచుతోందని వ్యాఖ్యానించారు.

కార్మికులు అధైర్యానికి లోనుకాకుండా సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రాణత్యాగం ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ప్రతి కార్మికుడు తమ కుటుంబాన్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ విలీనంపై స్పష్టత ఇవ్వడంతో పాటు జీతాల బకాయిలను చెల్లించాలని, కార్మికులకు ఆర్థిక, మానసిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుజ్జ సత్యం స్పష్టం చేశారు. కార్మికుల ప్రాణాలు రాజకీయాల కంటే ముఖ్యమని, వాటిని కాపాడటం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.