NewsPolitics

లెక్కల్లో ఉంటేనే హక్కులు… బీసీలకు గుజ్జ సత్యం పిలుపు

సత్య తెలంగాణ హైదరాబాద్, ఏప్రిల్ 29: దేశవ్యాప్తంగా ప్రారంభమైన జనగణన–2027లో భాగంగా ప్రవేశపెట్టిన డిజిటల్ స్వయంనమోదు విధానం (Self Enumeration) బీసీ వర్గాల భవిష్యత్తును నిర్ణయించే కీలక దశగా మారనుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పేర్కొన్నారు. ప్రతి బీసీ కుటుంబం తప్పనిసరిగా ఈ ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా రాష్ట్రాన్ని ఎంపిక చేసి, కుటుంబ యజమాని వివరాలు నమోదు చేయడం, OTP ద్వారా ధృవీకరణ పూర్తి చేయడం, మ్యాప్‌లో ఇంటి లొకేషన్ గుర్తించడం, HLO ప్రశ్నావళి నింపడం వంటి దశల ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని వివరించారు. వివరాలు సమర్పించిన తర్వాత 11 అంకెల SE ID లభిస్తుందని, ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు ఆ ఐడీ చూపించాల్సి ఉంటుందని తెలిపారు.

బీసీ వర్గాల అసలు జనాభా, వారి సామాజిక–ఆర్థిక పరిస్థితులపై ఇప్పటికీ ఖచ్చితమైన గణాంకాలు లేకపోవడం వల్ల అనేక విధానాల్లో అన్యాయం జరుగుతోందని గుజ్జ సత్యం అన్నారు. ఈ జనగణన ద్వారా నిజమైన గణాంకాలు వెలుగులోకి వస్తే రిజర్వేషన్ల పునర్వ్యవస్థీకరణ, బడ్జెట్ కేటాయింపులు, విద్య–ఉపాధి అవకాశాల్లో సమానత్వం సాధించేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.

“గణాంకాలే హక్కుల పునాది” అని స్పష్టం చేసిన ఆయన, జనగణనను కేవలం గణాంకాల ప్రక్రియగా కాకుండా బీసీల హక్కుల కోసం జరిగే సామాజిక ఉద్యమంగా చూడాలని సూచించారు. ప్రతి కుటుంబం నమోదు చేయకపోతే ఆ వర్గం మొత్తం నష్టపోతుందని, అందరూ చురుకుగా పాల్గొనాలని కోరారు.

దేశంలో సామాజిక న్యాయం, రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చల మధ్య ఈ జనగణనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఆయన అన్నారు. ఖచ్చితమైన డేటా ఆధారంగా మాత్రమే సమాన హక్కులు సాధ్యమని పేర్కొన్నారు.

ఒక కుటుంబానికి ఒక్క మొబైల్ నంబర్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని, కుటుంబ యజమాని పేరు నమోదు చేసిన తర్వాత మార్పు చేయలేమని, వివరాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు.

“మన సంఖ్యే మన శక్తి… మన డేటానే మన హక్కుల ఆయుధం” అంటూ గుజ్జ సత్యం ప్రజలను చైతన్యపరిచారు. ప్రతి బీసీ కుటుంబం జనగణనలో పాల్గొని తమ భవిష్యత్తును స్వయంగా నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.