ఫూలే ఆశయాలు ఇంకా అసంపూర్తే…సమానత్వం కోసం మరో దశ పోరాటం : గుజ్జ సత్యం
- తెలంగాణ సిటిజెన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో
“మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ఎక్సలెన్స్ అవార్డ్ – 2026” కార్యక్తమంలో

హైదరాబాద్, ఏప్రిల్ 10: దేశంలో సామాజిక సమానత్వం ఇంకా సాధ్యం కాలేదని, ఫూలే చూపిన మార్గంలో మరో దశ పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు.
నగరంలోని రవీంద్రభారతిలో తెలంగాణ సిటిజెన్స్ కౌన్సిల్ చైర్మన్ రాజ్ నారాయణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ఎక్సలెన్స్ అవార్డ్ – 2026” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
“ఫూలే ఆశయాలు ఇంకా ఆచరణలోకి రాలేదు”
ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ గుజ్జ సత్యం తీవ్ర విమర్శలు గుప్పించారు.
“సమానత్వం అనే మాట ప్రభుత్వాల ప్రసంగాల్లో మాత్రమే వినిపిస్తోంది, కానీ విధానాల్లో కనిపించడం లేదు” అని వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్‌కోటా లేకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు, చేనేత రంగంలో కొనసాగుతున్న సంక్షోభం అని పేర్కొన్నారు.
బీసీ విద్యార్థులు ఉన్నత విద్యలో తీవ్రంగా వెనుకబడుతున్నారని, సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు కావడం లేదని గుజ్జ సత్యం ఆందోళన వ్యక్తం చేశారు.
“విద్య లేకుండా సమానత్వం సాధ్యం కాదు… ఫూలే గారి మొదటి పాఠం ఇదే” అని అన్నారు.
దేశంలో బీసీల జనాభా భారీగా ఉన్నప్పటికీ, రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు.
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇది డిమాండ్ కాదు – రాజ్యాంగబద్ధ హక్కు అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి టీ. చిరంజీవులకు “మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ఎక్సలెన్స్ అవార్డ్ – 2026” ప్రదానం చేయడం జరిగింది.
సామాజిక చైతన్యంతో కూడిన పరిపాలనలో ఆయన చేసిన సేవలను వక్తలు ప్రశంసించారు.
మాజీ ఎంపీ వి. హనుమంతరావు మాట్లాడుతూ,
“ఫూలే గారి ఆలోచనలు ఇప్పటికీ ప్రాసంగికమే. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా బలమైన వేదిక అవసరం” అన్నారు.
మాజీ స్పీకర్ కె. మధుసూదనాచారి పేర్కొంటూ,
“సామాజిక న్యాయం అమలు కావాలంటే పాలనలో స్పష్టమైన సంకల్పం అవసరం” అని అన్నారు.
రిటైర్డ్ ఐపీఎస్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ,
“చట్టాలు ఉన్నా, అమలు లేకపోతే ప్రయోజనం లేదు. బీసీల సమస్యలను వ్యవస్థాత్మకంగా పరిష్కరించాలి” అని సూచించారు.
బీసీల హక్కుల సాధన కోసం అవసరమైతే దేశవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని గుజ్జ సత్యం హెచ్చరించారు.
“ఫూలే జయంతి ఒక వేడుక మాత్రమే కాదు… అది పోరాటానికి పునాది” అని పేర్కొన్నారు.
సమానత్వం కోసం పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉందని, బీసీ వర్గాల హక్కులు సాధించే వరకు ఉద్యమం ఆగదని వక్తలు స్పష్టం చేశారు.

