ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగణన సన్నాహాలు ప్రారంభం – 2027లో డిజిటల్ విధానంలో గణన
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగణనకు సన్నాహాలు ప్రారంభం – డిజిటల్ విధానంలో తొలి గణన
సత్య తెలంగాణ, వరంగల్: దేశవ్యాప్తంగా చేపట్టనున్న 16వ జనగణనకు ముందస్తు ఏర్పాట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభమయ్యాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల యంత్రాంగాలు జనగణన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, పర్యవేక్షణ అధికారుల నియామకం, అవసరమైన సామగ్రి సమకూర్చడం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే సిబ్బంది నియామకం, గ్రామాల వారీగా మ్యాప్‌ల సిద్ధం వంటి పనులు ప్రారంభమయ్యాయి.
ఈసారి దేశంలో పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జనగణన జరగనుండటంతో జిల్లా యంత్రాంగాలు సమగ్రంగా సన్నాహాలు చేపడుతున్నాయి. డిజిటల్ గణన ద్వారా మురికివాడలు, మారుమూల ప్రాంతాలు కూడా పూర్తిగా కవర్ చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా డబుల్ ఎంట్రీలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు.
రెండు దశల్లో జనగణన
దేశవ్యాప్తంగా జనగణన నిర్వహణకు కేంద్ర హోంశాఖ గత సంవత్సరం జూన్‌లోనే గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2027 మార్చి 1 నాటికి రెండు దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నారు. తొలి దశలో గృహాల జాబితా తయారు చేసి, రెండో దశలో జనగణన నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన చేపట్టాలి. చివరిసారిగా 2011లో ఈ ప్రక్రియ నిర్వహించగా, 2021లో జరగాల్సిన జనగణన కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.
ఈసారి జనగణనతో పాటు కుల గణన, జాతీయ పౌర పట్టిక (ఎన్‌సీఆర్) సమాచారాన్ని కూడా ఒకేసారి సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
గృహాల గుర్తింపు ప్రక్రియ
ఈ ఏడాది ఎన్యూమరేటర్లు ముందుగా గృహాల గుర్తింపు (హౌస్ లిస్టింగ్) ప్రక్రియ చేపడతారు. అనంతరం రెవెన్యూ, మున్సిపల్, గ్రామపంచాయతీ, ప్రణాళిక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలను సరిపోల్చుతారు. 2027 ఫిబ్రవరిలో ఇంటింటికి వెళ్లి జనగణన నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 అర్ధరాత్రి 12 గంటల వరకు జన్మించిన వారి వివరాలు నమోదు చేస్తారు. మార్చి 1తో జనగణన ప్రక్రియ ముగుస్తుంది.
గణకులుగా పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈసారి మొబైల్ యాప్ ద్వారా జనాభా వివరాలు నమోదు చేస్తారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి రెండు దఫాలుగా వెళ్లి సమాచారం సేకరిస్తారు. మొదటి దఫాలో ఇళ్ల సంఖ్య, కుటుంబ స్థితిగతులు, ఆస్తులు, ఆదాయం, వసతులు వంటి వివరాలు నమోదు చేస్తారు. రెండో దశలో జనాభా, కులం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై సమాచారం సేకరిస్తారు.
పట్టణ విస్తరణ ప్రాంతాల గుర్తింపు
పట్టణీకరణకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని ప్రభుత్వం ఇటీవల జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పట్టణాలకు సమీపంలో భవిష్యత్తులో విస్తరించే ప్రాంతాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ప్రధాన గ్రామపంచాయతీల పరిసర ప్రాంతాలు, రైల్వే కాలనీలు, విశ్వవిద్యాలయ ప్రాంగణాలు, సైనిక శిబిరాలు వంటి ప్రాంతాలను ఈ జనగణనలో గుర్తించనున్నారు. ఈ వివరాల సేకరణ కోసం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్లు ఇప్పటికే లేఖలు పంపించారు.
అధికారులకు ప్రత్యేక బాధ్యతలు
జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీఆర్‌వో, సీపీవోతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నియమించే మరో అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో తహసీల్దార్ జనగణన అధికారిగా వ్యవహరిస్తారు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్‌వో) సహాయకుడిగా పనిచేస్తారు.
గణకులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తారు. ఐదారు గణకులకు ఒక సూపర్‌వైజర్ ఉండగా, వీరికి వివిధ స్థాయిల్లో శిక్షణ ఇస్తారు. ఉన్నత స్థాయి అధికారులకు హైదరాబాద్‌లో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తైన తర్వాత ప్రభుత్వం అందించే ప్రశ్నావళి ఆధారంగా జనగణన చేపడతారు.
2011 జనాభా లెక్కల వివరాలు
2011 జనగణన ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా 35,12,576. ఇందులో పురుషులు 17,59,281 మంది, స్త్రీలు 17,53,295 మంది ఉన్నారు. జిల్లాకు మొత్తం 12,846 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. ప్రధాన మతాల్లో హిందువులు 93.20 శాతం, ముస్లింలు 5.62 శాతం ఉన్నారు. అక్షరాస్యత రేటు 65.11 శాతంగా నమోదు కాగా, పురుషుల అక్షరాస్యత 74.58 శాతం, స్త్రీలది 55.69 శాతం.
జిల్లాలో మొత్తం గృహాలు 8,88,553. పట్టణ జనాభా 28.25 శాతం కాగా, గ్రామీణ జనాభా 71.75 శాతం. ప్రతి చదరపు కిలోమీటరుకు 273 మంది జనసాంద్రత ఉంది. లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 997 మంది స్త్రీలు.
పదహారేళ్లలో మార్పులు
గత పదహారేళ్లలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 2011లో 35,12,576 ఉన్న జనాభా 2026 నాటికి సుమారు 38,40,000లకు పెరిగింది. 2001లో ఈ జనాభా 32,46,004గా నమోదైంది.
2011 తర్వాత జిల్లాలో పట్టణాలు విస్తరించాయి. అక్షరాస్యత రేటు పెరగడంతో పాటు లింగ నిష్పత్తిలో మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రామపంచాయతీలు 1646 నుంచి 1708కి పెరిగాయి. మున్సిపాలిటీలు 9 నుంచి 13కు, మండలాలు 68 నుంచి 72కు పెరిగాయి.

