ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను నెలకు రూ.500 కోట్ల చొప్పున విడుదల చేయాలి- గుజ్జ సత్యం
- జీవో నెం.7 రద్దుతో ఏర్పడిన గందరగోళంపై ప్రభుత్వం ప్రత్యేక విధాన ప్రకటన చేయాలి
- లక్షలాది మంది బీసీ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి గతంలో అమలులో ఉన్న జీవో నెం.7 రద్దు అనంతరం ఏర్పడిన గందరగోళ పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే స్పష్టతనిస్తూ ప్రత్యేక విధాన ప్రకటన విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీవో నెం.7 రద్దు తరువాత ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హతలు, చెల్లింపుల విధానం, పెండింగ్ బకాయిల పరిష్కారం వంటి అంశాలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించకపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు తీవ్ర అయోమయంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఆధారపడి ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారని పేర్కొన్న గుజ్జ సత్యం, విధానపరమైన స్పష్టత లేకపోవడం వల్ల వారి విద్యా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అనేది కేవలం సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదని, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిన సామాజిక న్యాయ పథకమని పేర్కొన్నారు. అలాంటి పథకాన్ని బలహీనపరిచే ఏ నిర్ణయమైనా లక్షలాది మంది విద్యార్థుల ఆశయాలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులు కళాశాలల్లో అవమానాలు ఎదుర్కొంటుండగా, మరోవైపు విద్యాసంస్థలు కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని తెలిపారు. అనేక కళాశాలలు ప్రభుత్వ బకాయిల కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం పాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
ఇటీవల ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా బకాయిల చెల్లింపులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, ఈ పరిస్థితి కొనసాగితే విద్యార్థుల చదువులు మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన బీసీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
జీవో నెం.7 రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేసి, ఫీజు రీయింబర్స్‌మెంట్ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఏ విద్యార్థి కూడా నష్టపోకుండా అర్హులైన అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించేలా కొత్త మార్గదర్శకాలు తీసుకురావాలని సూచించారు.
అదేవిధంగా రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, నెలకు కనీసం రూ.500 కోట్ల చొప్పున విడతల వారీగా విడుదల చేసి అన్ని బకాయిలను క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీసీ విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా విధానం, ప్రత్యేక విద్యా నిధి, విదేశీ విద్య సహాయం, పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్, డిజిటల్ విద్యా సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. విద్యను హక్కుగా గుర్తించి, విద్యార్థుల భవిష్యత్తును కాపాడే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన విధాన ప్రకటన చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన, బీసీ సంఘాలతో కలిసి విస్తృత ఉద్యమ కార్యాచరణ చేపడతామని గుజ్జ సత్యం హెచ్చరించారు.

