News

రాజ్యసభ సీట్లలో బీసీలకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం – గుజ్జసత్యం

  • సామాజిక న్యాయం మాటల్లోనే మిగిలింది

సత్య తెలంగాణ హైదరాబాద్ : తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను బీసీ వర్గాలకు కేటాయించాలన్న డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం బీసీలు ఉన్నప్పటికీ, వారికి రాజ్యసభ వంటి అత్యున్నత శాసనసభలో తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
సామాజిక న్యాయం, సమానత్వం అనే నినాదాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీసీల న్యాయమైన డిమాండ్‌ను పెడచెవిన పెట్టడం విచారకరమని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో బీసీల అభ్యున్నతికి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతోందని ఆయన మండిపడ్డారు.
రాజ్యసభలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా వారి సమస్యలు జాతీయ స్థాయిలో ప్రస్తావించబడే అవకాశం ఉంటుందని గుజ్జ సత్యం పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీ వర్గాలకు రాజకీయంగా తగిన గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను బీసీలకు కేటాయించడం సామాజిక న్యాయానికి అనుగుణమైన నిర్ణయం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం వల్ల బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని తెలిపారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని పునర్విమర్శించి భవిష్యత్తులో రాజ్యసభ సహా కీలక పదవుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. లేకపోతే బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Satya Telangana is a Telugu daily newspaper delivering the latest news and updates.