ఎండలతో పెరిగిన బీర్ సేల్స్.. ఒక్క రోజులోనే 40% పెరుగుదల
ఎండాకాలం ప్రారంభమవడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రంగా ఉండగా, ఉదయం 10 గంటల తర్వాత బయట తిరగాలంటే ప్రజలు రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు చల్లని పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మద్యం ప్రియులు చల్లగా ఉండే బీర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బీర్ అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
మార్చి 2వ తేదీన ఒక్క రోజులోనే బీర్ అమ్మకాలు సుమారు 40 శాతం వరకు పెరిగినట్లు సమాచారం. సాధారణంగా మార్చి నుంచి జూన్ వరకు వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నెలల్లో బీర్ విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇక ఫిబ్రవరి నెలలో 28 రోజుల్లో మొత్తం రూ.3,210 కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోదయ్యాయి. ఫిబ్రవరి 28 ఒక్కరోజే సుమారు 3 లక్షల 28 వేల కేసుల బీర్, 2 లక్షల 85 వేల కేసుల హార్డ్ లిక్కర్ అమ్ముడైనట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.
ఇదిలా ఉండగా సంగారెడ్డిలోని బీర్ తయారీ కంపెనీలను ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తాజాగా పరిశీలించారు. వేసవి కాలంలో బీర్ కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బీర్ తయారీ ఫ్యాక్టరీలకు నీటి సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేలా చూడాలని జలమండలి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

