శివాజీ కొత్త సినిమా బంపర్ ఆఫర్.. ₹499కే 4 మందికి టికెట్ + పాప్‌కార్న్!
శివాజీ చాలా కాలం తర్వాత సోలో హీరోగా నటిస్తున్న సినిమా “సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని” (Sampradayini Suppini Suddapoosani). ఈ చిత్రంలో లయ కథానాయికగా నటిస్తోంది. పూర్తి కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, తర్వాత అనూహ్యంగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. కొందరు ప్రముఖులు ముందుగానే సినిమా చూసి కంటెంట్ బాగుందని చెప్పడంతో, వారి సూచనల మేరకు చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నిర్మాతలు ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇటీవల థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోతున్న నేపథ్యంలో కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చారు. నలుగురు కలిసి సినిమా చూడటానికి వస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ₹499కి ఫ్యామిలీ టికెట్‌తో పాటు లార్జ్ పాప్‌కార్న్ అందించనున్నారు. మల్టీప్లెక్స్‌లలో అయితే ₹699కి ఫ్యామిలీ టికెట్ + లార్జ్ పాప్‌కార్న్ ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ ఆఫర్ నలుగురు పెద్దలకు వర్తిస్తుందని, నలుగురు స్నేహితులు వచ్చినా ఫ్యామిలీగా పరిగణిస్తామని నిర్వాహకులు చెప్పారు. దీంతో ప్రేక్షకులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
“సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని” చిత్ర బృందం ప్రకటించిన ఈ ఆఫర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కంటెంట్ కూడా ఆకట్టుకుంటే సినిమా మరింత మంచి విజయాన్ని సాధించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆఫర్ నిజంగా థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురాగలదా అన్నది చూడాల్సి ఉంది. ఒకవేళ ఇది విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు కూడా ఇలాంటి ఆఫర్లను తీసుకురావచ్చు.

