NewsPolitics

బీసీ ఉద్యమం గెలిచింది.. పట్టణ పాలనలో బీసీల ఆధిపత్యం – గుజ్జ సత్యం

మున్సిపల్ ఎన్నికల్లో బీసీల హవా – 61% పీఠాలు కైవసం..

హైదరాబాద్, సోమవారం: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలు ఘన విజయం సాధించడం తెలంగాణలో కొనసాగుతున్న 42 శాతం రిజర్వేషన్ ఉద్యమానికి స్పష్టమైన ఫలితమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా, ఎన్నికలు పూర్తయిన 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీలు చైర్‌పర్సన్లుగా ఎన్నికై 60.95 శాతం పదవులను కైవసం చేసుకున్నారని తెలిపారు. వైస్ చైర్‌పర్సన్లలోనూ 41 శాతం బీసీలే ఎన్నిక కావడం గమనార్హమన్నారు.

ఏడు కార్పొరేషన్లలో నాలుగు చోట్ల బీసీలు మేయర్ పదవులు దక్కించుకోవడం ద్వారా మొత్తం 57.14 శాతం మేయర్ పదవులను సాధించారని వివరించారు. బీసీ రిజర్వేషన్ కింద 35 స్థానాలు గెలుచుకోవడంతో పాటు, జనరల్ కోటాలోనూ ఒక మేయర్, 27 మంది మున్సిపల్ చైర్‌పర్సన్లు బీసీ వర్గాలకు చెందడం ఈ ఎన్నికల ప్రత్యేకత అని పేర్కొన్నారు.

సాధారణంగా జనరల్ స్థానాల్లో ఓసీ వర్గాల ఆధిపత్యం ఉండే పరిస్థితిని ఈసారి బీసీలు మార్చారని గుజ్జ సత్యం అన్నారు. సిరిసిల్ల, పోచంపల్లి వంటి చేనేత ప్రాంతాలు, నల్గొండ, వనపర్తి వంటి రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాల్లో సామాజిక సమీకరణాల ఆధారంగా బీసీలకు అవకాశాలు పెరిగినట్టు తెలిపారు. గౌడ, పద్మశాలి, మున్నూరు కాపు, ముదిరాజ్ వర్గాలకు చెందిన నేతలు జనరల్ స్థానాల్లో గెలుపొందడం సామాజిక న్యాయానికి సంకేతమన్నారు.

ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాలను మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో 55 శాతం పైగా వార్డుల్లో బీసీలే విజయం సాధించడం ఉద్యమ బలం ఎంత పెరిగిందో చూపుతోందన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో కొనసాగుతున్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి ఆర్ కృష్ణయ్య నాయకత్వం వహిస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో సాగుతున్న పోరాటం ఫలితమే ఈ విజయమని గుజ్జ సత్యం స్పష్టం చేశారు. పంచాయతీ స్థాయి నుంచి పట్టణ స్థాయికి బీసీల నాయకత్వం విస్తరించిందని, ఇది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.

“బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. స్థానిక సంస్థల్లో వచ్చిన ఈ ఫలితాలు ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతం. జనాభా దామాషా న్యాయం సాధించే వరకు మా ఉద్యమం ఆగదు” అని గుజ్జ సత్యం హెచ్చరించారు.