హోలీ ఎప్పుడు? అయోమయానికి ఫుల్ స్టాప్ – పండితుల క్లారిటీ
హోలీ ఎప్పుడు? అయోమయానికి ఫుల్ స్టాప్ – పండితుల క్లారిటీ!…
సత్య తెలంగాణ హైదరాబాద్ : ప్రతి ఏటా ఫాల్గుణ పౌర్ణమి నాడు వైభవంగా జరుపుకునే రంగుల పండుగ ‘హోలీ’ తేదీపై ఈసారి ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది. చంద్రగ్రహణ ప్రభావం, ప్రభుత్వ సెలవుల నేపథ్యంలో పండుగను ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై జ్యోతిష్య పండితులు స్పష్టత ఇచ్చారు.
ద్రిక్ పంచాంగం ప్రకారం హోలికా దహన్‌కు మార్చి 2వ తేదీ సాయంత్రం 6.22 గంటల నుంచి రాత్రి 8.50 గంటల వరకు శుభ ముహూర్తం ఉంది. సోమవారం సాయంత్రం 5.55 గంటలకు పౌర్ణమి తిథి ప్రారంభమై, మార్చి 3వ తేదీ సాయంత్రం 5.07 గంటలకు ముగియనుంది. అయితే చంద్రగ్రహణ ప్రభావం ఉన్నందున హోలికా దహన్ వేడుకను మార్చి 2నే నిర్వహించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఇక మార్చి 3న గ్రహణ దోషం కారణంగా రంగులు చల్లుకోవడం వంటి వేడుకలను నిర్వహించకూడదని స్పష్టం చేశారు. అందువల్ల హోలీ ఉత్సవాలను మార్చి 4న జరుపుకోవడం శ్రేయస్కరమని పేర్కొన్నారు.
గ్రహణ ప్రభావం నేపథ్యంలో పండుగ తేదీపై స్పష్టత వచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు బ్యాంకులకు మార్చి 3నే సెలవులు ప్రకటించడంతో కొంత గందరగోళం నెలకొంది. అయితే ముందుగా ప్రకటించిన సెలవుల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు వెల్లడించారు.
దీంతో కొందరు మార్చి 3నే హోలీ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, మరికొందరు జ్యోతిష్య సూచనల మేరకు మార్చి 4న రంగుల పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. మొత్తానికి ఈసారి హోలీ పండుగ తేదీపై చర్చ నడుస్తున్నప్పటికీ, ప్రజలు తమ విశ్వాసాలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

