Tech

eBay లో మరోసారి లేఆఫ్స్: 800 మందికి గుడ్‌బై

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం eBay మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. సంస్థలో సుమారు 800 మందిని లేఆఫ్స్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వ్యూహాత్మక ప్రాధాన్యాలకు అనుగుణంగా సంస్థ పునర్వ్యవస్థీకరణ చేపడుతోందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిలో మార్పులు అవసరమని వెల్లడించింది. ఈ తొలగింపులు అన్ని విభాగాల్లో ఉంటాయని, ఏ ఒక్క శాఖకు మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేసింది.

ఇటీవల సెకండ్‌హ్యాండ్ దుస్తుల మార్కెట్‌ప్లేస్ అయిన Depop ను 1.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఈబే ప్రకటించింది. జెన్‌జీ, మిలీనియల్ కస్టమర్లను ఆకర్షించేందుకు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా ఈ డీల్‌ను పేర్కొంది. ఈ పరిణామాల మధ్య లేఆఫ్స్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈబేలో సుమారు 12,300 మంది ఉద్యోగులు ఉన్నారు. 2024లో కూడా సంస్థ దాదాపు వెయ్యి మందిని తొలగించిన విషయం తెలిసిందే.

ఇక ఉద్యోగుల కోతలతో పాటు ఈబే ఇటీవల కృత్రిమ మేధ (AI) రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. OpenAI సహా పలు ఏఐ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.

మరోవైపు Walmart, Amazon వంటి దిగ్గజాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అలాగే Etsy, TikTok Shop వంటి ఆన్‌లైన్ వేదికలు వేగంగా ఎదుగుతూ మార్కెట్‌లో పోటీతత్వాన్ని పెంచుతున్నాయి.

అయితే, ఇటీవల ముగిసిన త్రైమాసికంలో సంస్థ ఆదాయం అంచనాలకు అనుగుణంగా పెరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 15 శాతం పెరిగి 3 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *