News

ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 44 విమానాలు రద్దు

ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ విమానయానంపై తీవ్రంగా పడుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయడం లేదా మార్గాలను మార్చడం ప్రారంభించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని Rajiv Gandhi International Airport నుంచి గల్ఫ్, అరబ్ దేశాలకు వెళ్లే విమానాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

44 విమాన సర్వీసులు నిలిపివేత

శంషాబాద్ విమానాశ్రయం నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన 23 విమానాలు రద్దు కాగా, విదేశాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన మరో 21 విమానాలు కూడా నిలిచిపోయాయి. దుబాయ్, దోహా (ఖతార్), కువైట్, దమ్మమ్, సౌదీ అరేబియా, షార్జా, అబుదాబి, జెడ్డా, మస్కట్ వంటి గల్ఫ్ గమ్యస్థానాలకు వెళ్లే సర్వీసులు ప్రభావితమయ్యాయి.

ప్రయాణికుల ఆందోళన

ముందస్తు సమాచారం లేకుండానే విమానాలు రద్దవడంతో ఎయిర్‌పోర్టులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర దేశాలకు కనెక్టింగ్ ఫ్లైట్లు ఉన్న ప్రయాణికులు తమ తదుపరి ప్రయాణాలు మిస్ అవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని విమానయాన సంస్థలు టికెట్ రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ తేదీలను అందిస్తున్నప్పటికీ, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరిస్తారో స్పష్టత లేదు.

మార్గ మార్పులతో పెరుగుతున్న ప్రయాణ సమయం

ఇరాన్, ఇజ్రాయెల్ వైమానిక క్షేత్రాలను మూసివేయడం లేదా ప్రమాదకర ప్రాంతాలుగా ప్రకటించడంతో విమానాలు ప్రత్యామ్నాయ, సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ సమయం సగటున 2 నుంచి 3 గంటల వరకు పెరుగుతోంది. అదనపు ఇంధన వినియోగం కారణంగా విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉందని విమానయాన వర్గాలు సూచిస్తున్నాయి.

ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు ప్రయాణించాలనుకునే వారు తమ విమాన సంస్థల నుంచి అధికారిక సమాచారం పొందిన తర్వాతే ఎయిర్‌పోర్టుకు రావడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *