వీర సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలి: విహెచ్పీ నేత పగుడాకుల బాలస్వామి డిమాండ్

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (సత్య తెలంగాణ): దేశ స్వాతంత్ర ఉద్యమంలో వినాయక్ దామోదర్ సావర్కర్ త్యాగం అజరామరమని, ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు.
సావర్కర్ ధైర్యం అసమానమని, బ్రిటిష్ ప్రభుత్వ తీరును తిరస్కరించి తిరుగుబాటు చేసిన మహోద్యమకారుడు అన్నారు. గురువారం సావర్కర్ 61వ వర్ధంతి సందర్భంగా కాచిగూడ చౌరస్తాలోని వీర సావర్కర్ విగ్రహానికి పూలమాలవేసి విశ్వహిందూ పరిషత్ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ.. కొంతమందికి సావర్కర్ పేరు ఉంటే అసహనం పుట్టుకొస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కొదమసింహాల్లా పోరాడిన వీరుల్లో వీరసావర్కర్ పోరాటపటిమ అగ్రస్థానంలో ఉంటుందని చెప్పారు. అలాంటి సావర్కర్ భారత జాతి సంపద అని చెప్పక తప్పదన్నారు. కానీ సావర్కర్ త్యాగాన్ని చిన్నదిగా చేసి చూపడం, ఆయన గౌరవాన్ని తగ్గించే కుట్ర చేసేందుకు నేడు కొంతమంది పోటీ పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినవారికి ఆకుల్లో , కాని వారికి కంచాల్లో.. వడ్డించినట్లు దేశ చరిత్రను కొంతమంది పక్షపాతంగా చరిత్రలోకి ఎక్కించారని విమర్శించారు. ఎవరు అవునన్నా కాదన్నా సావర్కర్ విప్లవానికి ప్రేరణ అన్నారు. “ప్రతి భారతీయుడిలో స్వాభిమానం, విప్లవ జ్వాలను రగిలించిన నిప్పురవ్వ” అని వివరించారు. ఆయన త్యాగం, అనుభవించిన చిత్రహింసలు, చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం అని చెప్పారు. ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం అని, తల్లి భారతి వైభవం కోసం కాలాపాని జైలులో కాలరాత్రులు గడిపిన స్ఫూర్తి ప్రదాత పని సావర్కర్ సేవలను కొనియాడారు. స్వాభిమానం, స్వావలంబనలో జాతి వైభవానికి వెలుగు రేఖ సావర్కర్ అని చెప్పాను. అలాంటి మహనీయుడికి భారతరత్న అవార్డు ఇవ్వడం సముచితం అని బాలస్వామి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 26వ తేదీన వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా భారత ప్రభుత్వం వారికి భారతరత్న అవార్డును ప్రధానం చేసి, సావర్కర్ చరిత్ర నేటి సమాజానికి అందుబాటులోకి తీసుకురావడం తప్పనిసరి అని చెప్పారు. ఏది ఏమైనా నేటి తరం యువతకు, విద్యార్థులకు సావర్కర్ పోరాట పటిమ, దేశభక్తి, త్యాగానికి గుర్తుగా భారతరత్న ఇచ్చి సత్కరించాలని బాలస్వామి అన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు ఘనపురం రాఘవేంద్ర గౌడ్, అఖిలేష్, అనిల్, ధీరజ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

