విద్యా కమిషన్ రిపోర్టుపై బండి సంజయ్ ఫైర్: “చెత్తబుట్టలో వేయాల్సిన నివేదిక”
సత్య తెలంగాణ ఫిబ్రవరి 28: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యా కమిషన్ నివేదికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “అలాంటి రిపోర్టును చెత్తబుట్టలో వేయాలి” అని వ్యాఖ్యానించారు. విద్యారంగ అభివృద్ధికి స్పష్టమైన సిఫారసులు లేకపోవడమే కాకుండా, ఉపాధ్యాయుల జీతాలు తగ్గించాలని సూచించడం సిగ్గుచేటని అన్నారు.
శనివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యావేత్తలు లేని కమిషన్కు విలువ ఏముందని ప్రశ్నించారు. “అర్బన్ నక్సలైట్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ నివేదిక ప్రజలకు ఉపయోగం ఏమిటి?” అని నిలదీశారు.
విద్యాశాఖకు మంత్రి లేకపోవడాన్ని కూడా గుర్తించని కమిషన్ ఎందుకు అవసరమని ప్రశ్నించిన బండి సంజయ్, పాఠశాలల్లో చాక్ పీసులు, స్కావెంజర్లు లేని పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపకుండా కనీస ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 45కు పెంచడం దుర్మార్గమని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులు స్కూల్ స్థాయిలోనే ఫెయిలై ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకోకుండా రూపొందించిన ఏకపక్ష నివేదిక ఇది అని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయులను అవమానించే విధంగా కమిషన్ వ్యవహరించిందని మండిపడ్డారు.
స్థానిక పరిస్థితులను పట్టించుకోకుండా విదేశాల్లో పర్యటించి నివేదికలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించిన బండి సంజయ్, ఉపాధ్యాయులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఇళ్ల కూల్చివేతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, మావోయిస్టుల అంశంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు.

