తెలంగాణలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం: 14 ఏళ్ల బాలికలకు ఉచిత ‘గార్డాసిల్’ టీకా
తెలంగాణలో మహిళల ఆరోగ్య రక్షణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నివారణ కోసం హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది. హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆడబిడ్డల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి ఏడాది సుమారు 55 వేల నుంచి 60 వేల వరకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య మరో 10 శాతం పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో కేన్సర్ చికిత్స సేవలను విస్తరిస్తున్నామని, హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా ములుగు, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో కూడా కీమోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉందని, తెలంగాణలో ఏటా సగటున 3,200 మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ అని, దాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.
14 సంవత్సరాలు పూర్తయి, 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలందరికీ ఈ టీకాను ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.5 నుంచి 4 లక్షల బాలికలకు వచ్చే మూడు నెలల్లో వ్యాక్సిన్ అందించనున్నట్లు చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో గార్డాసిల్ (Gardasil) వ్యాక్సిన్ ఒక్క డోసు ధర రూ.3,000 నుంచి రూ.4,000 వరకు ఉండగా, ప్రభుత్వం ఈ టీకాను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడు నెలల పాటు కొనసాగుతుందని, ప్రస్తుతం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉందని తెలిపారు. త్వరలో మరిన్ని పీహెచ్‌సీల్లో కూడా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ 14 ఏళ్ల ఆడబిడ్డలకు తప్పనిసరిగా ఈ టీకా వేయించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. “మన ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడటం అంటే రాష్ట్ర భవిష్యత్తును కాపాడటమే” అని ఆయన పేర్కొన్నారు.

