NewsPolitics

ఆర్. కృష్ణయ్య చేతులు మీదుగా ‘సత్య తెలంగాణ’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

హైదరాబాద్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘సత్య తెలంగాణ’ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజానికి నిజాయితీ, న్యాయం, ప్రజాస్వామ్య విలువలను అందిస్తూ ‘సత్య తెలంగాణ’ తెలుగు వార్తాపత్రిక అద్భుతమైన సర్కులేషన్‌తో ముందుకు సాగుతోందని ప్రశంసించారు. ప్రజాస్వామ్య మనుగడకు, సమాజాభివృద్ధికి వార్తాపత్రికల పాత్ర అపారమైనదని, బడుగు, బలహీన, పీడిత వర్గాల సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేయాలని సూచించారు. ప్రజల ఆశయాలను ప్రతిబింబించేలా సమాచారం, విశ్లేషణలతో సమాజాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు ‘సత్య తెలంగాణ’ కృషి చేయాలని ఆకాంక్షించారు.

‘సత్య తెలంగాణ’ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఎడిటర్ గుజ్జ సత్యం మాట్లాడుతూ, పత్రిక యొక్క దృక్పథం, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. ప్రారంభ సంవత్సరంలోనే ఐదు లక్షల డిజిటల్ సర్కులేషన్ సాధించినట్టు తెలిపారు. అతి త్వరలో ఒక మిలియన్ మైలురాయిని దాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, పాఠకులు, శ్రేయోభిలాషుల సహకారంతో దీన్ని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కో-ఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్, గొరిగ మల్లేష్, అనురాధ గౌడ్, పద్మ రాజ్ కుమార్, సంఘం ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, పాఠకులు పాల్గొన్నారు.