కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఓబీసీల సంక్షేమం కోసం 2 లక్షల కోట్లు కేటాయించాలి..
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్.

హైదరాబాద్, జనవరి 12: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ఓబీసీలు సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. దేశ జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న ఓబీసీల అభివృద్ధికి ఇది అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
మండల్ కమిషన్ అంచనాల ప్రకారం ఓబీసీలు దేశ జనాభాలో సగానికి మించినప్పటికీ, వారి సామాజిక–ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ వెనుకబడి ఉందని గుజ్జ సత్యం తెలిపారు. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక సహాయం, సామాజిక అభివృద్ధి వంటి రంగాల్లో ప్రత్యేక పథకాల ద్వారా ఓబీసీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు తగిన స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
గత ఏడాది (2025–26) బడ్జెట్‌లో ఓబీసీల సంక్షేమానికి సంబంధించి రూ.4 వేల కోట్లకు మించని కేటాయింపులు మాత్రమే ఉన్నాయని, ఇది మొత్తం కేంద్ర బడ్జెట్‌లో 0.1 శాతం కన్నా తక్కువేనని ఆయన విమర్శించారు. ఈ తక్కువ కేటాయింపుల వల్ల ఓబీసీలలో విద్యా వెనుకబాటుతనం, ఉద్యోగ అవకాశాల కొరత, ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయని అన్నారు. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం 27 శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ, దానికి తగిన బడ్జెట్ మద్దతు లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.
సీఏజీ నివేదికల ప్రకారం ఓబీసీలకు కేటాయించిన కొన్ని నిధులు వినియోగం కాకుండానే తిరిగి వెళ్లిపోతున్నాయని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని గుజ్జ సత్యం ఆరోపించారు. రూ.2 లక్షల కోట్ల కేటాయింపుతో ప్రత్యేక విద్యాసంస్థలు, ఉద్యోగ శిక్షణ కేంద్రాలు, ఆర్థిక సహాయ పథకాలను బలోపేతం చేయవచ్చని చెప్పారు. ఓబీసీల అభివృద్ధిలో పెట్టుబడి పెడితే దేశ జీడీపీ పెరుగుతుందని, పేదరికం తగ్గి ప్రభుత్వానికి పన్నుల రూపంలో మరిన్ని ఆదాయాలు వస్తాయని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు.
ఓబీసీలలోని మరింత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలంటే ప్రత్యేక బడ్జెట్ నిధులు ఉపయోగపడతాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్లే ఓబీసీలకూ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఓబీసీల ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం వంటి రంగాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, తద్వారా దేశ ఆర్థిక వృద్ధికి బలమైన పునాది పడుతుందని గుజ్జ సత్యం తెలిపారు. ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌లో ఓబీసీల అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. “దేశంలో ఓబీసీలు అతిపెద్ద సామాజిక వర్గం. వారిని బలోపేతం చేస్తేనే భారత్ నిజంగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది” అని గుజ్జ సత్యం వ్యాఖ్యానించారు.
ఈ మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సౌత్ ఇండియా సెక్రటరీ సూర్యనారాయణ, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు జెల్ల నరేందర్, మరపంగు వెంకన్న, కర్నాటి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

