TrendyNewsViral

టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్: దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్‌ 2026లో కీలక ఘట్టం మొదలైంది. తొలి సెమీఫైనల్‌లో భాగంగా ఇవాళ (బుధవారం) దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు వేదిక కానుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, ఫైనల్‌లో చోటు దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఇరు జట్లు కసితో బరిలోకి దిగుతున్నాయి.

ఈ టోర్నీలో ఇప్పటివరకు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్‌లో ఫేవరెట్‌గా భావిస్తున్నారు. గ్రూప్ దశతో పాటు సూపర్-8లో కూడా ఒక్క మ్యాచ్ కూడా కోల్పోకుండా సఫారీ జట్టు దూసుకెళ్లింది. ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం చూపుతూ ఆత్మవిశ్వాసంతో సెమీస్‌కు చేరుకుంది. అంతేకాదు, గ్రూప్ దశలో న్యూజిలాండ్‌ను ఓడించిన అనుభవం కూడా దక్షిణాఫ్రికాకు మానసికంగా పైచేయి కల్పిస్తోంది.

ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే.. సౌతాఫ్రికా జట్టును ఎదుర్కోవాలంటే కివీస్ మరింత మెరుగైన ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే న్యూజిలాండ్ కూడా బలమైన జట్టే. ఓపెనర్లు మంచి ఆరంభం అందిస్తే మధ్య వరుస బ్యాటర్లు ఫిలిప్స్, మిచెల్, రచిన్ రవీంద్రలపై పెద్ద బాధ్యత ఉంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 200 పరుగుల లక్ష్యం చేరుకుంటేనే కివీస్ పోటీలో నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పిచ్ నుంచి స్పిన్నర్లకు పెద్దగా సహాయం లేకపోయినా పేసర్లకు మాత్రం కొంత మద్దతు లభించే అవకాశం ఉంది. వాతావరణ పరంగా చూస్తే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని అంచనా. ఒకవేళ వర్షం ఆటంకం కలిగించినా సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఏర్పాటు చేశారు. ఆ రోజూ మ్యాచ్ పూర్తికాకపోతే సూపర్-8 దశను మెరుగ్గా ముగించిన జట్టుకు ఫైనల్ అవకాశం లభిస్తుంది.

అంచనా జట్లు

దక్షిణాఫ్రికా:
డికాక్, రికెల్టన్, మార్క్రమ్ (కెప్టెన్), బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బోష్, కేశవ్ మహరాజ్, రబాడ, ఎంగిడి.

న్యూజిలాండ్:
అలెన్, సీఫర్ట్, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, శాంట్నర్ (కెప్టెన్), నీషమ్, డఫీ, ఫెర్గూసన్, ఇష్ సోధి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *