NewsTrendy

ఇరాన్ యుద్ధం ప్రభావం: భారత్‌లో వంట నూనె, గ్యాస్ ధరలు పెరిగే ప్రమాదం

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఈ యుద్ధ ప్రభావం కారణంగా చమురు ధరలు పెరిగి, వాణిజ్య లోటు మరియు ద్రవ్యోల్బణం భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం ఈ నెల నుంచే కనిపించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజల జీవన వ్యయాలపై కూడా త్వరలోనే భారం పెరిగే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం పడింది.

హోర్ముజ్ జలసంధి మూసివేత భారత వంటింటి బడ్జెట్‌పై కూడా ప్రభావం చూపనుంది. భారత్‌కు అవసరమైన సోయా, సన్‌ఫ్లవర్‌ వంటి వంట నూనెలను విదేశాల నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుంది. అర్జెంటీనా, బ్రెజిల్‌, అమెరికా దేశాల నుంచి సోయా ఆయిల్‌, ఉక్రెయిన్‌, రష్యా నుంచి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటోంది.

ఈ వంటనూనెలను తీసుకువచ్చే నౌకలు సాధారణంగా సూయజ్‌ కాలువ, హోర్ముజ్ జలసంధి మార్గాల ద్వారా ప్రయాణిస్తాయి. అయితే ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి మూసివేయబడటంతో నౌకలు మరింత దూరం ప్రయాణించి భారత రేవులకు చేరాల్సి వస్తోంది. దీని వల్ల రవాణా ఖర్చులు పెరిగి, చివరకు వినియోగదారులపై ధరల రూపంలో భారం పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో ముడి చమురు దిగుమతులపై ప్రభావం పడితే వంటగ్యాస్ ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

ఇక భారత్ ప్రతి సంవత్సరం సుమారు 5–6 మిలియన్ టన్నుల కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పుధాన్యాలను మయన్మార్‌, కెనడా, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. హోర్ముజ్ జలసంధి మార్గం నిలిచిపోవడంతో ఈ సరుకులు తీసుకువచ్చే నౌకలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఫలితంగా రవాణా, బీమా ఖర్చులు పెరిగి వాటి ప్రభావం చివరకు రిటైల్ మార్కెట్‌లో ధరల పెరుగుదలగా కనిపించవచ్చు.

అదే విధంగా జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్ వంటి డ్రైఫ్రూట్స్ ధరలు కూడా పెరిగే అవకాశముంది. ఇవి ఎక్కువగా ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి భారత్‌కు దిగుమతి అవుతాయి. ప్రస్తుతం ఇరాన్ యుద్ధ పరిస్థితుల్లో ఉండటం, అఫ్గానిస్థాన్‌–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఈ దిగుమతులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే హోర్ముజ్ జలసంధి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తేనే భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్లలో కూడా ధరలు స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *