“బీసీలను ప్రత్యేకంగా చూడమని కాదు.. స్పష్టంగా లెక్కించమని అడుగుతున్నాం!”
- 2027 జనగణనలో OBC గుర్తింపు, కులాల వారీగా శాస్త్రీయ కోడింగ్, నమ్మదగిన డేటా అవసరం: గుజ్జ సత్యం.

హైదరాబాద్, సెప్టెంబరు 28: 2027 జనగణనలో బీసీ, ఓబీసీల జనాభాను కచ్చితంగా నమోదు చేయడంతో పాటు వారి సామాజిక, విద్యా, ఉపాధి పరిస్థితులను భవిష్యత్ విధానాలకు ఉపయోగపడేలా శాస్త్రీయంగా డేటా సేకరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. ఓబీసీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన అతిథి వక్తగా మాట్లాడారు.
కేంద్రం ఆగస్టు 14న నోటిఫై చేసిన 2027 జనగణన రెండో దశ ప్రశ్నావళిలో 10వ ప్రశ్న “Scheduled Caste (SC)/Scheduled Tribe (ST)/Caste”గా ఉందని, అందులో ఓబీసీకి ప్రత్యేకంగా పేరుతో కూడిన కేటగిరీ లేకపోవడంపై స్పష్టత అవసరమని గుజ్జ సత్యం పేర్కొన్నారు. అధికారిక ప్రశ్నావళిలో కులం/జాతి పేరు నమోదు చేసే అంశం ఉన్నప్పటికీ, ఓబీసీ గుర్తింపు, రాష్ట్రాల వారీ జాబితాల అనుసంధానం, కులాల కోడింగ్ ఎలా జరుగుతుందన్న విషయాలపై సమగ్ర మార్గదర్శకాలు అవసరమని అన్నారు.
“జనగణన అంటే కేవలం జనాభాను లెక్కించడం కాదు.. భవిష్యత్ విధానాలకు ఉపయోగపడే నమ్మదగిన డేటాను రూపొందించడం. లెక్కల్లో స్పష్టత లేకపోతే విధానాల్లో స్పష్టత ఎలా వస్తుంది?” అని గుజ్జ సత్యం ప్రశ్నించారు. కులాన్ని లెక్కించడం కులవివక్షను ప్రోత్సహించడం కాదని, సమాజంలోని అసమానతలు, వెనుకబాటుతనాన్ని అర్థం చేసుకోవడానికి ఆధారాలతో కూడిన సమాచారం అవసరమని అన్నారు.
2011లో కుల వివరాల నమోదులో ఎదురైన వర్గీకరణ, పేర్ల భిన్నత్వం వంటి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి ముందుగానే రాష్ట్రాల వారీ ప్రామాణిక కుల జాబితాలు, యూనిక్ కుల కోడ్‌లు, ఉపకులాలు–ప్రాంతీయ పేర్ల మ్యాపింగ్, డిజిటల్ ధ్రువీకరణ, ఎన్యుమరేటర్లకు ప్రత్యేక శిక్షణ వంటి చర్యలు తీసుకోవాలని సమావేశంలో నేతలు సూచించారు.
తెలంగాణలో నిర్వహించిన SEEEPC-2024 సర్వేను ప్రస్తావిస్తూ గుజ్జ సత్యం, రాష్ట్రంలో 242 కులాలను విశ్లేషించగా 135 కులాలు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ వెనుకబాటుతనాన్ని చూపాయని, వాటిలో 69 బీసీ కులాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ గణాంకాలు బీసీలలోనూ సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో తేడాలు ఉన్నాయని చూపిస్తున్నాయని అన్నారు.
“ఓబీసీలకు ప్రత్యేక హక్కు ఇవ్వాలని మాత్రమే మేము కోరడం లేదు.. దేశ జనాభాలో వారి వాస్తవ స్థితి స్పష్టంగా కనిపించేలా కచ్చితమైన లెక్కలు కావాలి. జనాభా, విద్య, ఉపాధి, ప్రాతినిధ్యం వంటి అంశాలపై భవిష్యత్ విధానాలు రూపొందించాలంటే నమ్మదగిన డేటా తప్పనిసరి” అని గుజ్జ సత్యం అన్నారు.
జె. ఎంజీరప్ప మాట్లాడుతూ, ఓబీసీల కచ్చితమైన జనాభా గణాంకాలు భవిష్యత్ విధానాల రూపకల్పనకు కీలకమని, కులగణనలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమన్నారు. దౌలత్ రామ్ చేసియా మాట్లాడుతూ, ఓబీసీల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులను అంచనా వేయాలంటే కులాల వారీ డేటా అవసరమని, ఉపకులాలు, ప్రాంతీయ పేర్లను శాస్త్రీయంగా నమోదు చేయాలని అన్నారు.
రామేశ్వర్ తొగురే మాట్లాడుతూ, కులగణన కేవలం సంఖ్యల సేకరణగా కాకుండా భవిష్యత్ సంక్షేమ, విద్య, ఉపాధి విధానాలకు ఉపయోగపడే డేటాగా ఉండాలని అన్నారు. వీజీఆర్ నారగోని మాట్లాడుతూ, ఓబీసీలలో కులాల వారీగా వెనుకబాటుతనంలో తేడాలు ఉన్నందున సామాజిక, విద్యా, ఆర్థిక సూచికల ఆధారంగా విశ్లేషణ జరగాలని సూచించారు.
ఎం. సూర్యనారాయణ మాట్లాడుతూ, జనగణనలో సేకరించే వివరాలు భవిష్యత్ విధానాలకు కీలక ఆధారాలుగా మారుతాయని, ఎన్యుమరేటర్లకు శిక్షణతో పాటు డేటా ధ్రువీకరణ, నాణ్యతా తనిఖీలు ఉండాలని అన్నారు. పోతులూరి దేవి మాట్లాడుతూ, ఓబీసీ మహిళలు, విద్యార్థులు, యువత పరిస్థితులను కూడా కచ్చితమైన గణాంకాల ఆధారంగా అంచనా వేసి అవసరమైన లక్ష్యిత విధానాలు రూపొందించాలని పేర్కొన్నారు.
సమావేశంలో జె. ఎంజీరప్ప, దౌలత్ రామ్ చేసియా, రామేశ్వర్ తొగురే, వీజీఆర్ నారగోని, ఎం. సూర్యనారాయణ, పోతులూరి దేవి తదితరులు పాల్గొన్నారు.
చివరగా గుజ్జ సత్యం మాట్లాడుతూ, “బీసీలను ప్రత్యేకంగా చూడమని కాదు.. స్పష్టంగా లెక్కించమని అడుగుతున్నాం. లెక్కలు కచ్చితంగా ఉంటేనే విధానాలు ఆధారాలతో రూపొందుతాయి. డేటా బలంగా ఉంటేనే సామాజిక న్యాయంపై చర్చకు శాస్త్రీయ పునాది ఏర్పడుతుంది” అని పేర్కొన్నారు.

