NewsPolitics

తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని నిర్మిద్దాం : గుజ్జ సత్యం

  • 56% బీసీలకు రాజకీయ న్యాయం దక్కే వరకు పోరాటం:
  • బీసీల జనాభాకు అనుగుణంగా అధికార, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.
  • ⁠జనాభాలో మెజారిటీ.. అధికారంలో మాత్రం మైనారిటీ.

హైదరాబాద్: తెలంగాణలో జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం, నిర్ణయాధికారంలో తగిన వాటా దక్కడం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, బీసీ జాక్ స్టేట్ కోఆర్డినేటర్ గుజ్జ సత్యం విమర్శించారు. బీసీల రాజకీయ సాధికారత కోసం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో విస్తృతమైన, ఐక్యమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

“56% బీసీలు… రాజకీయ న్యాయం ఎక్కడ?” అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో గుజ్జ సత్యం ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ తాండూరు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

గుజ్జ సత్యం మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో బీసీలు మెజారిటీగా ఉన్నప్పటికీ అసెంబ్లీ, మంత్రివర్గం, పార్లమెంట్, శాసనమండలి, కీలక రాజకీయ నిర్ణయాధికార వ్యవస్థల్లో వారి ప్రాతినిధ్యం జనాభా నిష్పత్తికి అనుగుణంగా లేదన్నారు.

“ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు కావాలి.. కానీ అధికారంలో బీసీల వాటా ఎందుకు కనిపించదు? జనాభాలో మెజారిటీగా ఉన్న సమాజం నిర్ణయాధికారంలో మైనారిటీగా ఉండటం ప్రజాస్వామ్య అసమానతకు నిదర్శనం. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన సమస్య కాదు. అన్ని రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సామాజిక న్యాయ సమస్య” అని అన్నారు.

బీసీలకు కేవలం సంక్షేమ పథకాలు, హామీలు సరిపోవని, రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. టికెట్ల కేటాయింపు నుంచి మంత్రివర్గం, శాసనమండలి, రాజ్యసభ, పార్లమెంట్ వరకు జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యంపై స్పష్టమైన విధానం అవసరమన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో మాటలకే పరిమితం కాకుండా చట్టపరమైన, రాజ్యాంగపరమైన రక్షణతో అమలు చేయాలని గుజ్జ సత్యం కోరారు. రాష్ట్ర శాసనసభ 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ప్రక్రియకు తుది పరిష్కారం లభించేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అన్నారు.

“బీసీల రిజర్వేషన్లను ఎన్నికల హామీగా కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుగా చూడాలి. రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు వస్తే వాటిని అధిగమించే విధంగా అన్ని పార్టీలతో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలి” అని సూచించారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ 2027 జనగణనలో OBCలకు ప్రత్యేక కేటగిరీని చేర్చాలని ఏకగ్రీవంగా తీర్మానించడం స్వాగతించదగ్గ పరిణామమని గుజ్జ సత్యం అన్నారు. కేంద్ర జనగణనలో బీసీలను ‘Other Caste’ అనే సాధారణ విభాగంలో కలిపేయకుండా ప్రత్యేకంగా గుర్తించాలని, రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వాల అధికారిక బీసీ కులాల జాబితాలను డిజిటల్ జనగణన వ్యవస్థలో ముందుగానే చేర్చాలని తెలంగాణ అసెంబ్లీ కోరింది.

“కులగణన కులాలను విభజించడానికి కాదు.. అసమానతలను కొలవడానికి. డేటా లేకుండా సామాజిక న్యాయ విధానాలను ఎలా రూపొందిస్తారు?” అని ఆయన ప్రశ్నించారు.

కులగణనతో పాటు ప్రతి కులానికి యూనిక్ కోడ్, స్పష్టమైన వర్గీకరణ, శాస్త్రీయ డేటా అవసరమన్నారు. కులగణన పూర్తయిన తర్వాత ఆ గణాంకాలను బడ్జెట్, విద్య, ఉద్యోగాలు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యంతో అనుసంధానం చేయాలని కోరారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమం “తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాంతం, భాష, హక్కుల ఆధారంగా ప్రజలు ఏకమై చారిత్రక ఉద్యమాన్ని నిర్మించారు. అదే తరహాలో బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కోసం బీసీ ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిర్మించాల్సిన అవసరం ఉంది” అని గుజ్జ సత్యం అన్నారు.

అయితే ఈ ఉద్యమం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కాకుండా సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరిగే ఉద్యమంగా ఉండాలని స్పష్టం చేశారు.

బీసీ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను మూడు అంశాల చుట్టూ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. “మొదట డేటా కావాలి.. ఆ డేటా ఆధారంగా ప్రాతినిధ్యం కావాలి.. ఆ ప్రాతినిధ్యం నిర్ణయాధికారంగా మారాలి. జనాభా లెక్కలు తేల్చి, వాటికి అనుగుణంగా రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో వాటా కల్పించే వరకు ఉద్యమం కొనసాగాలి” అని అన్నారు.

బీసీ యువతను ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని, బీసీ మహిళలకు రాజకీయ నాయకత్వ అవకాశాలను పెంచాలని, ప్రతి రాజకీయ పార్టీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక ప్రాతినిధ్యంపై పారదర్శక విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

“బీసీల ఓటు బ్యాంకు కాదు.. బీసీలు అధికార భాగస్వాములు. జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు రాజకీయంగా కూడా న్యాయమైన వాటా దక్కే వరకు పోరాటం ఆగదు” అని గుజ్జ సత్యం స్పష్టం చేశారు.

Share this: