News

హెచ్‌సీఏ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రారంభం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో పనిచేస్తున్న ఉద్యోగులు గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. హెచ్‌సీఏ సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ (HCASE) సభ్యులు ఉప్పల్ స్టేడియంలో నిరసన వ్యక్తం చేస్తూ తమ డిమాండ్లను వెల్లడించారు.

పెండింగ్‌లో ఉన్న ఓవర్‌టైమ్ (OT) బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు గ్రౌండ్ సిబ్బందికి కన్వేయన్స్ అలవెన్సులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ నియామక ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని కూడా కోరారు.

గతంలో మూడు నెలల పాటు జీతాలు లేకపోయినా సంస్థ పట్ల అంకితభావంతో పనిచేశామని సిబ్బంది తెలిపారు. అయితే తమ సమస్యలపై మేనేజ్‌మెంట్‌కు పలుమార్లు లేఖలు రాసినా ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా మెడికల్ రీయింబర్స్‌మెంట్లు ఇవ్వడంతో పాటు ఉద్యోగులందరికీ క్యాష్‌లెస్ ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఉప్పల్ స్టేడియంలో పనులను నిలిపివేస్తామని యూనియన్ హెచ్చరించింది.

ఈ సమ్మె కారణంగా మ్యాచ్‌ల నిర్వహణలో అంతరాయం ఏర్పడితే దానికి మేనేజ్‌మెంటే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కుటుంబాలను పోషించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇక ఓపిక లేకపోవడంతోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని హెచ్‌సీఏ సిబ్బంది తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *