విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలన్న హైకోర్టు సూచనను వెనక్కి తీసుకోవాలి: గుజ్జ సత్యం డిమాండ్
- ఫీజు భారం విద్యార్థులపై మోపడం అన్యాయం: బీసీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దు
- ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందా?

హైదరాబాద్, సత్య తెలంగాణ ప్రతినిధి: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల నేపథ్యంలో విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని వచ్చిన సూచనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు బడుగుబలహీన వర్గాల విద్యార్థులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.
విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని హైకోర్టు చేసిన సూచనపై కూడా గుజ్జ సత్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “సామాజిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి సూచనలు ఇవ్వడం సరికాదు. హైకోర్టు తన సూచనను పునః సమీక్షించి విరమించుకోవాలి” అని అన్నారు.
ఫీజు రీయింబ ర్స్మెంట్పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గురువారం కీలక వ్యాఖ్య చేసిన నేపథ్యంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ, “ఆర్థిక ఇబ్బందులను చూపిస్తూ ప్రభుత్వం తన బాధ్యతను విద్యార్థులపైకి నెట్టివేయడం అన్యాయం. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సామాజిక న్యాయం కోసం రూపొందించబడింది. అలాంటి పథకాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమే” అని విమర్శించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేలాది మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నారని, ఈ నిర్ణయం వల్ల వారు చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, సామాజిక అసమానతలను మరింత పెంచే ప్రమాదకర నిర్ణయం” అని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా, ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్ నిధులను అత్యవసరంగా విడుదల చేసి విద్యార్థులపై పడుతున్న భారం తొలగించాలని కోరారు.
విద్య హక్కు రాజ్యాంగబద్ధమైనదని, ఆ హక్కును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. బడుగుబలహీన వర్గాల విద్యార్థులపై ఆర్థిక భారం మోపే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని గుజ్జ సత్యం హెచ్చరించారు.

