News

జూబ్లీహిల్స్ మంగళగౌరి మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

సత్య తెలంగాణ హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి షాపింగ్ మాల్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై మాట్లాడిన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రాందాస్ వివరాలు వెల్లడించారు.

అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం భవనంలో రెన్యువేషన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రమాదం సంభవించిన సమయంలో షాపులో సాధారణ సిబ్బంది ఎవరూ లేరని స్పష్టం చేశారు. రెన్యువేషన్ కారణంగా మెటీరియల్స్‌ను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు.

ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా వెల్డింగ్ పనుల కారణమా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందని పేర్కొన్నారు. ఘటన సమయంలో షాపులో ఐదుగురు మాత్రమే ఉండగా, వారు సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. షాపులో మెటీరియల్ లేకపోవడంతో ప్రమాద తీవ్రత తక్కువగానే ఉందని చెప్పారు.

అగ్నిప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయని హెచ్చరించారు. కాబట్టి షాపులు, వాణిజ్య సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రాందాస్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *