News

స్పీడ్ పోస్ట్‌తో 21 రాష్ట్రాలకు గంజాయి.. హైదరాబాద్ పోలీసులు ఛేదించిన రూ.5 కోట్ల డ్రగ్స్ రాకెట్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను హైదరాబాద్ పోలీసులు సంచలనాత్మకంగా ఛేదించారు. H-FAST అధికారులు, గుడిమల్కాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ప్రధాన నిందితుడు సత్యం మిశ్రాను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ గంజాయి రాకెట్ ద్వారా 21 రాష్ట్రాల్లోని వినియోగదారులకు స్పీడ్ పోస్ట్, కొరియర్ సేవల ద్వారా గంజాయి డోర్ డెలివరీ చేస్తున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

జార్ఖండ్ నుంచి హైదరాబాద్ వరకు విస్తరించిన గంజాయి నెట్‌వర్క్

సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన సత్యం మిశ్రా ఇంటర్ వరకు చదివి మొదట పెయింటింగ్ పని, అనంతరం లారీ డ్రైవర్‌గా పనిచేశాడు. 2018లో గంజాయికి అలవాటు పడిన అతడు, రాహుల్ జై, సచిన్ మిశ్రా, సంతోష్‌లతో కలిసి ఒక సిండికేట్‌గా ఏర్పడి సొంత గ్రామంలోనే గంజాయి సాగు ప్రారంభించారు. స్థానిక రైతుల వద్ద కూడా గంజాయి పంట పండించి కొనుగోలు చేసి, దేశవ్యాప్తంగా కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం ఈ కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి డోర్ డెలివరీ

డ్రగ్స్ రాకెట్ ప్రత్యేకత ఏమిటంటే.. స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి పంపిణీ చేయడమే. హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు సహా దేశంలోని 21 రాష్ట్రాలకు పార్సిళ్ల రూపంలో గంజాయి పంపిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

పార్సిళ్లలో మందులు ఉన్నట్లు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి పోస్టల్ అధికారులను మోసం చేస్తున్నారని సీపీ తెలిపారు. జార్ఖండ్‌లోని ఇస్రీ బజార్, ఫుస్రో పోస్టాఫీసుల నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ పార్సిళ్లు బుక్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

వాట్సాప్‌లో కోడ్ వర్డ్స్.. UPI ద్వారా చెల్లింపులు

గంజాయి సరఫరా నెట్‌వర్క్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నడుస్తోంది. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్లు స్వీకరించి, UPI, PhonePe ద్వారా నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కస్టమర్లతో నేరుగా గంజాయి పేరు ఉపయోగించకుండా కోడ్ వర్డ్స్‌తో ఆర్డర్లు తీసుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. రోజుకు సుమారు 80 నుంచి 100 ఆర్డర్లు వస్తుండగా, అందులో 8 నుంచి 10 స్పీడ్ పోస్ట్ పార్సిళ్ల ద్వారా గంజాయి పంపిణీ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

రూ.5 కోట్ల వార్షిక టర్నోవర్

ప్రతి పార్సిల్‌లో 50 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు గంజాయి ఉంచి పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్ ధర రూ.1,500 నుంచి రూ.8,000 వరకు ఉండేది.

ఈ అక్రమ వ్యాపారం ద్వారా రోజుకు సుమారు రూ.1 లక్ష, నెలకు రూ.30 నుంచి రూ.35 లక్షలు, ఏడాదికి రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు టర్నోవర్ సాధిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

బంగారం, లగ్జరీ కార్లు కొనుగోలు

గంజాయి వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో నిందితులు బంగారం, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనేక బ్యాంక్ ఖాతాలు, PhonePe UPI ఐడీల ద్వారా మనీలాండరింగ్ కూడా జరిగినట్లు గుర్తించారు.

పోస్టల్ పార్సిళ్ల స్కానింగ్ తప్పనిసరి చేయాలని కేంద్రానికి లేఖ

రైళ్లు, విమానాల ద్వారా వచ్చే స్పీడ్ పోస్ట్ పార్సిళ్లకు స్కానింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ అక్రమ రవాణా సులభంగా సాగిందని సీపీ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోస్టల్ పార్సిళ్లకు తప్పనిసరిగా స్కానింగ్ అమలు చేయాలని కేంద్ర శాఖలకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని అన్ని కొరియర్ సంస్థలకు ప్రతి పార్సిల్‌ను స్కాన్ చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు చెప్పారు.

అనుమానాస్పద పార్సిళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి

ఎస్‌ఆర్ నగర్, గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద పార్సిల్ ఆధారంగా ప్రారంభమైన దర్యాప్తుతో ఈ భారీ గంజాయి రాకెట్ బయటపడిందని సీపీ తెలిపారు. హైదరాబాద్‌కు వచ్చిన రెండు పార్సిళ్లు విమాన మార్గంలో వచ్చినట్లు కూడా గుర్తించారు.

ప్రజలు, కొరియర్ సంస్థలు అనుమానాస్పద పార్సిళ్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *