సర్వే పేరుతో మరో సారి బీసీలను మోసంగించాలని చూస్తే సహించం – గుజ్జ సత్యం

సర్వే పేరుతో మరో సారి బీసీలను మోసంగించాలని చూస్తే సహించమని, పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే బీసీల సంఖ్య తగ్గించిందని, ఆధార్, ఓటరు కార్డు, పాఠశాలలు, కళాశాలల విద్యార్ధుల సంఖ్య కలిపి మొత్తం 4.25కోట్ల జనాభా ఉండగా, తాజాగా విడుదల చేసిన కులగణన జాబితాలో కేవలం 3.64 కోట్లు ఉన్నట్లు పేర్కొనడంతోనే ప్రభుత్వ ద్వంద వైఖరి స్పష్టమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 60 శాతానికి పైగా బీసీలుంటే 46 శాతానికి తీసుకవచ్చారని, సుమారు 25 లక్షల మంది బీసీలను జనాభా లెక్కల నుంచి తొలగించారని ఆరోపించారు. మరో పది రోజుల్లో 3.1శాతం మిగిలిన కులగణన చేపడుతామని చెబుతున్నారని, అది సక్రమంగా నిర్వహిస్తారన్న నమ్మకం బీసీలకు లేదన్నారు. ఇప్పటికే విద్య, ఉద్యోగాల్లో తీవ్రంగా ఎంతో నష్టపోయామన్నారు. ఎస్సీ వర్గీకరణలో ఒక్క శాతం తగ్గితేనే మందకృష్ణ మాదిగ ఆందోళనకు తలొగ్గి ఇంటికి పిలిపించుకొని బుజ్జగించారని, 2కోట్లకు పైగా ఉన్న బీసీలు ఎంతో నష్టపోయామని ఆందోళన చేస్తుంటే పట్టించుకోవడం లేదన్నారు. తమిళనాడు మాదిరిగా బీసీల రిజర్వేషన్లు పెంచి 9వ షెడ్యూల్లోకి చేర్చి చట్టబద్దత కల్పించాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేయాలని, ఢిల్లీని బీసీల తరపున అఖిలపక్ష కమిటీని తీసుకెళ్లాలన్నారు. మరో సారి బీసీలకు అన్యాయం చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల తడాకా చూపిస్తామని హెచ్చరించారు.రీ సర్వే మళ్లీ ఇంటి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని, సర్వే పూర్తి అయిన తరువాత బి సి కులాల వారీగా సర్వే వివరాలు వెల్లడించాలని కోరారు. సూర్య రావు గారు మాట్లాడుతూ హిందూ బీసీలు, ముస్లిం బీసీ లంటూ కులగణనలో పేర్కొనడం అవివేకమని, అది రాజ్యాంగంలో లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సర్పంచ్ల సంఘం వ్యస్థాపక అధ్యక్షులు సాదామి భూమన్న యాదవ్, తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, తెలంగాణ విట్టల్, బీసీ సాధికారిత సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బి శంకర్, ఆరె కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చలపతి రావు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పి. వాసు, బత్తుల సిద్దేశ్వర్, బేరి రాంచందర్ యాదవ్, మున్నూరు కాపు సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్వీ మహేందర్, నాయకులు పెరుక రమేశ్ పటేల్, జె. వెంకటేశ్వర్ రావు, వేల్పురి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.