హైదరాబాద్ మెట్రోలో మోడీ…ప్లేస్, తేదీ ఖరారైంది
హైదరాబాదీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడింది. ఈ నెల 28న మెట్రో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ సమయంలో హైదరాబాద్‌కు వస్తారనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. మోడీజీ మెట్రోను ప్రారంభించడంలేదనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే అవన్నీ సత్యదూరమని తేలిపోయింది. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు హాజరుకానున్న సందర్భంగా మోడీజీ మెట్రోను ప్రారంభించనున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, నవంబర్ 28 సాయంత్రం 3 గంటల సమయంలో ప్రధాని నగరానికి చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మెట్రో ప్రారంభ వేదికైన మియాపూర్ చేరుకొని, మెట్రో ప్రారంభం, పైలాన్ ఆవిష్కరణ చేస్తారు. అనంతరం ప్రధాని మియాపూర్ నుంచి అమీర్‌పేట దాకా మెట్రో రైలులో ప్రయాణించి అదే రైలులో తిరిగి వస్తారు. అనంతరం హెచ్‌ఐసీసీలో జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరవుతారు. ఆపై ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే విందుకుకూడా హాజరయ్యే అవకాశం ఉందని విశ్వసనీయంగా అందిన సమాచారం. మొత్తంగా సుమారు 5.30 గంటలపాటు హైదరాబాద్‌లో గడుపుతారని సమాచారం.
అయితే ప్రధాని పర్యటనలో భద్రత దృష్ట్యా ఎలాంటి మార్పులైనా చోటు చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. ప్రస్తుత సమాచారం మేరకు పోలీసులు మియాపూర్ నుంచి అమీర్‌పేట్ రూట్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మియాపూర్ వద్ద ఇప్పటికే హెలిప్యాడ్ ఏర్పాటు చేయగా, పైలాన్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది.