NewsPolitics

పద్మశాలీల అభ్యున్నతికి తోడ్పడుతా ..మీ సోదరుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు…అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి 

భారత పద్మశాలి మహాసభలో మాట్లాడుతున్న
సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, మార్చి 09(సత్య తెలంగాణ): పద్మశాలీలు ఆర్థిక, రాజకీయ, ఉపాది, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నేతన్నలకూ అంతే ఇవ్వాలనే విధానపరమైన నిర్ణయంతో పని చేస్తున్నామన్నారు.. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి ఆధ్వర్యంలో జరిగిన పద్మశాలి మహాసభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, వనం దుష్యంతల, డాక్టర్ పుట్ట పాండురంగయ్య, పద్మశాలీ సంఘ నాయకులు, తదితరులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పద్మ శాలీలు ఆత్మగౌరవంలోనే కాదు… త్యాగంలోనూ ముందుంటారని కొనియాడారు. అలాంటి పద్మశాలీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఆలె నరేంద్ర త్యాగం లేకుండా మలిదశ తెలంగాణ ఉద్యమం ముందుకు సాగలేదనేది వాస్తవమన్నారు. అలాంటి ఆలె నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా చేస్తే కేసీఆర్ అనే ధృతరాష్ట్రడు అలె నరేంద్ర పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకోవడమే కాకుండా ఆయనను ఖతం చేసిన కథ పద్మశాలీలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ పద్మశాలీలను రాజకీయంగా ప్రోత్సహించిందన్నారు.

ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి లక్ష్మణ్ బాపూజీ పేరు

బీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పుడు నీడ కల్పించిన కొండా లక్ష్మణ్ బాపూజీకి కేసీఆర్ నిలువ నీడ లేకుండా చేశారని రేవంత్ ఫైర్ అయ్యారు. ఆయన చనిపోతే కేసీఆర్ కనీసం చూడటానికి వెళ్లలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఐఐహెచ్ టీ (ఇండియన్ ఇని

స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ)ని సాధించడమే కాకుండా దానికి కొండా లక్ష్మణ్ బావూజీ పేరు పెట్టుకున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆదర్శ మూర్తిగా నిలిచిన లక్ష్మణ్ బాపూజీ పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి పెడతామని ప్రకటించారు.

మార్కండేయ భవనానికి రూ. కోటి మంజూరు

మహారాష్ట్రలోని షోలాపూర్ లో పద్మశాలీలు చాలా మంది ఉన్నారని, అక్కడ పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.కోటి ఇచ్చి సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మీ సోదరుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు.. మీకు కావాల్సిన వనులు చేయించుకోండి అని సూచించారు. మీ అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలతో రండి.. వాటిని ఆమోదించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. కులగణనను పురిటిలోనే గొంతునొక్కాలని కొంత మంది కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆ కుట్రలను తిప్పికొట్టాలని మీ శక్తి యుక్తిని ప్రదర్శించి తనకు అండగా నిల బడాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి చూపిస్తానన్నారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పద్మశాలీ నేతలు, పద్మశాలి కుల బాంధవులు, చేనేత కార్మికులు వేలాదిగా హాజరయ్యారు. పద్మశాలి మహాసభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి కృతజ్ఞతలు తెలియజేశారు.