కులగణనకు గ్రీన్ సిగ్నల్ – కేంద్రానికి హృదయపూర్వక ధన్యవాదాలు- జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

హైదరాబాద్, ఏప్రిల్ 30, 2025: జాతీయ జనగణనలో కులగణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని మా పూర్తి మద్దతుతో స్వాగతిస్తున్నాము. సామాజిక న్యాయం, సమతా స్ధాపన దిశగా ఇదొక గొప్ప ముందడుగు.
1931 తర్వాత దేశ చరిత్రలో ఇదే తొలిసారి కేంద్రం కులగణనపై స్పష్టమైన ప్రకటన చేసింది. దేశంలోని అనేక వర్గాలకు ఈ నిర్ణయం న్యాయాన్ని చేకూర్చనుంది. సమాజంలోని వాస్తవిక పరిస్థితులను పసిగట్టి, సముచిత ప్రాతినిధ్యం కల్పించే మార్గాన్ని ఇది తెరిచినట్టే.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో సుమారు 55% జనాభా OBCలుగా ఉన్నారన్న అంచనాలున్నా, వారి స్థితిగతులపై అధికారిక గణాంకాలు లేవు. పేదలు, వంచిత వర్గాల డేటా లేనిది, విధానాలు లక్ష్యాన్ని మిస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కులగణన వాస్తవాల వెలుగులోకి తీసుకురానుంది.
ఈ నిర్ణయం ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుల దాకా చేరే అవకాశం ఉంది. నిస్సందేహంగా ఇది సామాజిక సమతా సాధనలో మైలురాయి. దీనివల్ల వృద్ధి, ప్రగతిలో భాగస్వామ్యం కల్పించే మార్గాలు విస్తృతంగా మారనున్నాయి.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర మంత్రివర్గానికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కులగణన కోసం దేశం వేచి చూసిన దశాబ్దాల నిరీక్షణకు కేంద్రం తెరదించింది.