తిరుమలలో ఇలా దర్శనం.. భోజనం.. బస.. !
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఆగమించింది. బ్రహ్మాది దేవతల సమక్షంలో సాగే ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సకల సన్నాహాలు పూర్తి చేసింది. తట్టిలేపే భక్తిభావన.. ఉట్టిపడే ఆధ్యాత్మికత.. కట్టిపడేసే కళారూపాలు.. అట్టహాసంగా సాగే తురగ గజ పదాతి దళాల కవాతు వెనుక చతుర్మాడ వీధుల్లో విహరించే స్వామివారి వైభవాన్ని చూసి తరించేందుకు భక్తకోటి నిరీక్షిస్తోంది. శ్రీవారి కరుణ కటాక్ష వీక్షణకు పాత్రులవ్వాలని ఆకాంక్షిస్తోంది.
సమస్త విశ్వభారాన్ని మోసే శ్రీమన్నారాయణుడికి వాహనంగా మారి తరించేందుకు సూర్యచంద్రులు, భక్తాగ్రేసరులైన గరుడుడు, హనుమంతుడు, పశుపక్షాదులు సంసిద్ధమయ్యాయి. జగత్ కల్యాణార్థం వేంకటేశ్వరుడు ప్రసన్న వదనుడై, వాహనరూడుడై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు కటాక్షించనున్నారు. ఈ నెల 23న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 1న ధ్వజావరోహణంతో పరిసమాప్తం కానున్నాయి. రోజూ రెండు వాహన సేవలు నిర్వహించేలా తితిదే ఏర్పాట్లు చేపట్టింది.