బాలు మరణం వెనక అసలు కారణం…
అద్భుతమైన గాయకుడు బాలుగారు ఇక లేకపోవడం చాలా విచారకరం.మనం ఆయనను కోల్పోవడానికి సైన్సుమీద మనకున్న అగౌరవమే కారణం తప్ప మరోటి కాదు. కరోనా విజృభిస్తున్న కాలంలో 74 యేళ్ళ వయసున్న ఒక సీనియర్ సిటిజన్ ని ఒక టీవీ షో కి రమ్మని పిలవడం అసలైన ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. “రివర్స్ ఐసోలేషన్” చేసి ఉండింటే, వయసు మీద పడిన వారిని అసలు బయటకే రానీయకుండా ఇంట్లోనే ఐసోలేట్ చేసి ఉండింటే బాలుగారికసలు ఈ ఇబ్బందే వచ్చి ఉండేది కాదు.
టీవీ షో నిర్వాహకులకైనా పెద్దాయనని ఇబ్బంది పెట్టకూడదని తెలియకపోయిందే. కనీసం బాలుగారి బంధు మిత్రులైనా ఈ సమయంలో గాదరింగ్ లు వద్దని వారించలేకపోయారా?. పాటలు పాడినా, గట్టిగా మాట్లాడినా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని డాక్టర్లం చెబుతూనే ఉన్నాం కదా. చూడండి మనకు సైన్సు పట్ల ఎంతటి నిర్లక్ష్యమో!.జులై 30 న ఆయన “సామజవరగమనా” అనే టీవీ షో అటెండ్ అయ్యారు. ఆ షోలో అటెండ్ ఐన అందరికీ పాజిటివ్ వచ్చింది బాలుగారితో సహా. మిగితా వారికి కరోనా తగ్గింది.
కానీ బాలూ గారు వయసులో పెద్దవారుకదా. కనీసం ఆయన వయసుకు గౌరవం ఇవ్వలేని తెలివి మన చదువులదా?. ఆయనని ఈ సమయంలో పిలవవలసినంత అవసరమేమొచ్చింది?. ఆ మొత్తం ప్రోగ్రామ్ జరిగిందే బాలు గారిని ఈ దశలో కోల్పోవడం కోసమనేలా ఉంది. ఇపుడు ప్రోగ్రామ్ జరగకపోతే ఏం కొంపలు మునిగేవి?. గౌరవమే లేదు. సైన్సంటే గౌరవం లేదు.
కరోనా వచ్చి ఆరు నెలలు దాటినా దాని బారినుంచి ఎలా రక్షించుకోవాలో ఈ రోజుకీ అవగాహన రాకుంటే అసలు చదివేదేమి చదువులు, పనికిమాలిన చదువులు కాకుంటే. ఈ రోజుకీ కరోనా వైరస్సే లేదనే వాట్సాప్ మేధావులున్నారంటే ఏం చెయ్యాలి?.ఏదేమైనా బాలు వంటి గాయకుడికి రావలసిన కష్టం కాదిది. చాలా దుఃఖంగా ఉంది. వుయ్ మిస్ యూ సర్! .
