NewsPolitics

ప్రభుత్వ వైఫల్యంతోనే కుల గణన రి-సర్వే ఫెయిల్ – బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం 

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం 

హైదరాబాద్,(సత్య తెలంగాణ): రాష్ట్రంలో చేపట్టిన కుల గణన రి-సర్వే  వైఫల్యానికి కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యతని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. గతంలో పాల్గొనని 3.56 లక్షల కుటుంబాల కోసం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు నిర్వహించిన బీసీ కుల గణన సర్వేలో ఎంత మంది పాల్గొన్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మొదటి సర్వేలో కొన్ని ప్రాంతాలలో పూర్తిగా సర్వే నిర్వహించలేదని అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించాలని చెప్పినా,  రీ సర్వే జరుగుతున్న విషయాన్ని ప్రకటన రూపంలో అవగాహన కల్పించాలని తెలియజేసిన ప్రభుత్వం స్పందించలేదన్నారు అవసరానికి మించి 75 ప్రశ్నలు ఇచ్చి ప్రజలను అయోమయానికి గురి చేశారన్నారు. సర్వే పూర్తి వివరాలను కులాల వారీగా లెక్కలను గ్రామాల వారిగా లెక్కలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు.

ఆదివారం కాచిగూడలో నిర్వ హించిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నీలం వెంకటేష్, ఉపాధ్యక్షుడు నందగోపాల్ తో కలిసి ఆయన మాట్లాడారు. కుల గణన సర్వేపై ప్రజలలో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సర్వే దరఖాస్తు ఫారాలు ఓ హోటల్లో పేపరు ప్లేట్లుగా మారాయన్నారు.