సమగ్ర కులగణన రీ సర్వేపై ప్రభుత్వ ప్రచారం చేయాలి – గుజ్జ సత్యం

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (సత్య తెలంగాణ): 21 సమగ్ర కులగణన రీ సర్వేపై ప్రభుత్వం విస్తృతమైన ప్రచారం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి కులగణన రీసర్వేకు సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల ప్రజల నుంచి స్పందన కరువైందని నాలుగు రోజులుగా నమోదవుతున్న వివరాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ప్రభుత్వం నిరుడు నవంబర్ లో నిర్వహించిన ఇంటింటి సర్వేలో దాదాపు 3.54 కోట్ల మంది పాల్గొనగా, 16 లక్షల మంది సర్వేకు దూరంగా ఉన్నారని. ఆ సర్వేలో నమోదు చేసుకోని వారి కోసం ఈ నెల 16న ప్రభుత్వం రీసర్వే చేపట్టింది. 16వ తేదీ నుంచి గురువారం వరకు 4 రోజుల్లో 4625 కుటుంబాలు మాత్రమే రీసర్వేలో పాల్గొని వివరాల నమోదు చేసుకున్నారని. ప్రజాపాలన సేవా కేంద్రాల్లో 4,227, వెబ్సైట్ ద్వారా 398 మంది సర్వే ఫారాలు డౌన్లోడ్ చేసుకున్నారని , టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా 040-21111115 6,415 కాల్స్ వచ్చినట్టు అధికారులు చెప్పారని. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రచార కార్యక్రమం చేపట్టి ప్రజలందరికీ సర్వే యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పత్రికలు, టెలివిజన్, రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని, సర్వే గురించి ఫిర్యాదు చేయడానికి, మరల నమోదు చేసుకోవడానికి టోల్-ఫ్రీ నంబర్ ను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. కొన్ని ప్రాంతాలలో సర్వే పూర్తిగా నిర్వహించలేదని అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను నియమించి సర్వే నిర్వహించాలని కోరారు. సంపూర్ణ డేటా లేకుండా, నిజమైన స్థితిని అంచనా వేయలేమని, కావున, ప్రభుత్వం తక్షణ చర్య తీసుకుని ఈ సర్వేలో లోపాలు లేకుండా నిర్వహించాలని కోరారు.