శాస్త్రీయ పద్ధతిలో కులగణన సర్వే చేయాలి – గుజ్జ సత్యం

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (సత్య తెలంగాణ):
ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి విధిగా వెళ్లి శాస్త్రీయ పద్ధతితో కులగణన సర్వే చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. కాచిగూడ లోని జిఎంఎస్ (గ్లోబల్ మీడియా సర్వీస్) లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్థం పర్థం లేని కాలమ్స్, 57 ప్రశ్నలతో ప్రజలను అయోమయానికి గురి చేయకుండా, సామాజిక వర్గం (కులం) తెలుసుకునేందుకు రెండు మూడు కాలమ్స్ తో సర్వేను సమగ్రంగా జరిపించాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని, ఓబీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కోరారు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధానిపై మరింత ఒత్తిడి పెంచాలని అన్నారు. మంత్రి మండలిలో 9 మందికి కేవలం బీసీలు ఇద్దరున్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న 6 మంత్రివర్గ స్థానాలను బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటే.. వెనుకబడిన తరగతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని గుజ్జ సత్యం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గణాంకాల ఆధారంగా ఇప్పటికే డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదిక సమర్పించిందన్నారు. మరోవైపు ఈనెల 16 నుంచి 28 వరకు సర్వే ప్రక్రియను మరోమారు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమిషన్ సైతం మరోమారు అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ద్వారా రిజర్వేషన్ల పెంపునకు నివేదిక సమర్పించినట్లుగానే, విద్య, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు పెంచేందుకు ప్రత్యేక కమిషన్ నివేదిక కీలకమని స్పష్టం చేశారు. అధ్యయనం పూర్తికాకముందే అసెంబ్లీలో బిల్లు పెడితే శాస్త్రీయత లోపిస్తుందన్నారు. అలాంటి బిల్లుకు చట్టబద్ధత ఉండదన్నారు. అన్ని రకాలుగా ఆలోచన చేశాకే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ముందుకెళ్లాలని గుజ్జ సత్యం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.