NewsPolitics

నామినేటెడ్ పోస్టులు అన్ని అగ్రవర్ణాలకేనా – గుజ్జ సత్యం

  • నామినేటెడ్ పోస్టులు అన్ని అగ్రవర్ణాలకేనా ?
  • సమాచార కమిషనర్  నియమకలో ఒక్కటీ బీసీలకు ఇవ్వరా… 
  • ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదా ? 
  • బీసీలపై మీ చిత్తశుద్ధి నామినేటెడ్ భర్తీలో చూపించండి  

 జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్

సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం

రాష్ట్ర సమాచార కమిషనర్ నియామకాల్లో సామాజిక న్యాయం పూర్తిగా కొరబడిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా బీసీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా, అగ్రకులాలకే సమాచార కమిషనర్ పదవులను కట్టబెట్టిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. తెలంగాణలో జరిగిన కులగణన లెక్కల ప్రకారం, రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉన్నప్పటికీ, నామినేటెడ్ పోస్టుల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయమని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 10 సమాచార కమిషనర్ పదవుల్లో ఇప్పటివరకు 7 పదవులు భర్తీ చేయగా, ఒక్క బీసీ అభ్యర్థికి కూడా అవకాశం దక్కలేదని అన్నారు

బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో గుజ్జ సత్యం మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ద్వారా బీసీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆ హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. “తెలంగాణలో 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు, అంటే రాష్ట్ర జనాభాలో 56% వాటా వారిది. అయినప్పటికీ, సమాచార కమిషనర్ పదవుల భర్తీలో బీసీలను పూర్తిగా పక్కనపెట్టడం వారిని అవమానించడమే” అని ఆయన అన్నారు. సమాచార కమిషనర్ పదవులకు కావాల్సిన అన్ని అర్హతలు బీసీ అభ్యర్థులకు ఉన్నప్పటికీ, నియామకాల్లో వారిని పట్టించుకోకపోవడం దారుణమని ఆయన ప్రశ్నించారు.

గుజ్జ సత్యం మాట్లాడుతూ, తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని, ఖాళీగా ఉన్న మిగిలిన మూడు సమాచార కమిషనర్ పదవులను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. “రాష్ట్రంలో జనాభా ప్రకారం 56% పదవులు బీసీలకు కేటాయించాలి. లేదా, కనీసం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన 42% రిజర్వేషన్‌ను అమలు చేయాలి” అని ఆయన ఒత్తిడి చేశారు. గత 10 సంవత్సరాలలో నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు కేవలం 15% మాత్రమే ప్రాతినిధ్యం లభించిందని, ఇది రాష్ట్ర జనాభా నిష్పత్తితో పోలిస్తే చాలా తక్కువని ఆయన గణాంకాలతో సహా వెల్లడించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం చేస్తామని పదేపదే హామీలు ఇస్తున్నప్పటికీ, చీఫ్ సెక్రటరీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌లు, సమాచార కమిషనర్‌లు వంటి నామినేటెడ్ పదవులన్నీ అగ్రకుల సామాజిక వర్గాలకు కట్టబెట్టడం బీసీలలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందని ఆయన అన్నారు. “రాష్ట్ర ప్రభుత్వం బీసీల విశ్వాసం చూరగొనాలంటే, కులగణన ఆధారంగా 56% లేదా కనీసం 42% పదవులు బీసీలకు కేటాయించాలి” అని గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దకపోతే, బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాయని ఆయన హెచ్చరించారు.