ప్రధానితో భేటీలో రిజర్వేషన్లపై ఎందుకు చర్చించలేదు? గుజ్జ సత్యం

సత్యతెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయిన సందర్భంలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్రం ఆమోదించాలని సీఎం ఎందుకు డిమాండ్ చేయలేదని ఆయన నిలదీశారు.
బుధవారం జరిగిన ఈ భేటీలలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసిన రిజర్వేషన్ బిల్లులు కేంద్రంలో ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి, వీటిని ఎప్పుడు క్లియర్ చేస్తారని ప్రధానిని అడగకపోవడం ఆశ్చర్యకరమని గుజ్జ సత్యం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి, రాష్ట్రపతి మరియు గవర్నర్‌కు పంపించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ అంశంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఆయన పేర్కొన్నారు.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేదనడానికి సీఎం ఢిల్లీ పర్యటనే సాక్ష్యమని విమర్శించారు. ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించాలని ప్రస్తావించకపోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. అలాగే, రాహుల్ గాంధీతో జరిగిన చర్చల్లో పార్లమెంటును స్తంభింపజేయాలని, బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం చేయాలని కోరకపోవడం దురదృష్టకరమని అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సాగిస్తున్న కపట నాటకాన్ని బీసీ సమాజం గమనిస్తోందని, వారి కుట్రలను ఎప్పటికప్పుడు బయటపెట్టి బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గుజ్జ సత్యం హెచ్చరించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

