నాగర్‌కర్నూల్ ఘటనపై సీఎం దృష్టికి… న్యాయం కోరుతూ గుజ్జ సత్యం లేఖ
* బాధిత కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం డిమాండ్, బాధ్యులపై కఠిన చర్యలు తప్పనిసరి.

సత్య తెలంగాణ హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన పసిపాప మృతి ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆందోళన కొనసాగుతున్న వేళ, ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం. ఈ ఘటనపై తక్షణ, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో రజక కుటుంబానికి చెందిన రెండు నెలల శిశువు మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధిత కుటుంబాన్ని స్వయంగా నాగర్‌కర్నూల్‌లో కలిసి పరామర్శించిన గుజ్జ సత్యం, వారి వేదనను తెలుసుకుని సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో ముఖ్యమంత్రికి లేఖ పంపినట్లు తెలిపారు.
లేఖలో సంఘటనపై నిష్పాక్షికంగా, వేగవంతంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు ప్రక్రియలో ఎటువంటి ప్రభావాలు లేకుండా పారదర్శకత పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు. “చిన్నారి ప్రాణం పోయిన ఘటనను సాధారణంగా తీసుకోరాదు. ఇది సమాజ మనస్సాక్షిని కదిలించిన విషాదం,” అని ఆయన పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ఆర్థిక సహాయం ప్రకటించాలని, కుటుంబంలోని ఒక అర్హుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గృహ పథకాల కింద ఇల్లు మంజూరు చేయాలని, ఘటనకు సంబంధించి బాధ్యత వహించిన స్థానిక ప్రజాప్రతినిధులపై విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌తో సహా పరిపాలనా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వెనుకబడిన తరగతులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బీసీ వర్గాలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని గుజ్జ సత్యం అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ప్రభుత్వం తీసుకునే చర్యలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగాఎదురుచూస్తున్నారు.
సమావేశంలో బీసీ జేఏసీ కన్వీనర్ రాజు నేత, ఓయూ జేఏసీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు వంశీ నేత , ఓయు జెఏసి చైర్మన్ బాలకృష్ణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ నేత తదితరులు పాల్గొన్నారు

