NewsPolitics

42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం” – ఆర్. కృష్ణయ్య .

  • 17%తో ఎన్నికలు అంగీకారం కాదు… మంత్రులను తిరగనివ్వం”
  • 20న ధర్నాలు–దీక్షలకు పిలుపు • 14 బీసీ సంఘాల సంయుక్త హెచ్చరిక

హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని 14 బీసీ సంఘాలు ప్రకటించాయి. నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య , జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం , జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగ అరుణ్ కుమార్  పాల్గొని సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమైన హక్కు. పాత విధానంలో 17 శాతంతో ఎన్నికలకు వెళ్లడం అన్యాయం. ఇది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య” అని తీవ్రంగా విమర్శించారు.

గత ఏడాది కాలంలో వందకు పైగా ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. “రాష్ట్ర బంద్ కూడా విజయవంతంగా నిర్వహించాం. అయినా ప్రభుత్వం గుడ్డిగా ముందుకు సాగుతోంది. ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని చూస్తే అది బలవంతపు చర్యగా భావిస్తాం” అని పేర్కొన్నారు.

హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలో ఎన్నికలకు వెళ్లడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. “కోర్టు తీర్పు బీసీల పక్షానే వస్తుందనే భయంతోనే తొందరపడుతున్నారు. 42 శాతం అమలు చేయకపోతే మంత్రులను నియోజకవర్గాల్లో తిరగనివ్వం” అని హెచ్చరించారు.

రాజకీయ పార్టీల ద్వంద వైఖరిని ఎండగట్టిన ఆయన, “బీసీలను తక్కువ అంచనా వేయొద్దు. ఇది చారిత్రాత్మక పోరాటం. ఇప్పుడే సాధించకపోతే భవిష్యత్తులో సాధ్యం కాదు” అన్నారు.

గుజ్జ సత్యం మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 20న ధర్నాలు, దీక్షలు, నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. “బీసీ ఉద్యమం ఇప్పుడు పల్లె పల్లెకు, ఇంటింటికి చేరింది. ఎవరు అడ్డుకున్నా ఆగదు. ప్రజలే ముందుకు నడిపించే ఉద్యమమిది” అన్నారు.

బీసీ సంఘాల నాయకులను బెదిరించడం, ఉద్యమాలను నీరుగార్చే కుట్రలు చేయడం తగదని హెచ్చరించారు. “బీసీల హక్కులు చట్టబద్ధమైనవి, న్యాయబద్ధమైనవి. ప్రభుత్వం తక్షణమే 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా జరిగే నిరసనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి” అని స్పష్టం చేశారు.

జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్లపై కోర్టు తీర్పులు వచ్చినప్పటికీ అక్కడి బీసీలు అంతగా స్పందించలేదని, కానీ తెలంగాణలో మాత్రం బీసీలు ఐక్యంగా నిలబడుతున్నారని అన్నారు.

“ఇది చివరి పోరాటం. 42 శాతం సాధించకపోతే బీసీల రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుంది. యువత, విద్యార్థులు, మహిళలు అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.

సమావేశంలో 14 బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని, ఐక్యంగా పోరాటాన్ని కొనసాగించాలని తీర్మానించారు. 20న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్ణయించారు.