NewsPolitics

బిసి బిల్లుఊసే ఎత్తని కేసీఆర్.. రాష్ట్రంలో రెండుకోట్లకు పైగా ఉన్న బీసీలంటే అలుసా…జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

హైదరాబాద్, ఏప్రిల్ 28, 2025: తెలంగాణ జనాభాలో 50 శాతం ఉన్న బీసీల పట్ల బీఆర్‌ఎస్‌ వైఖరి ఏమిటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ప్రశ్నించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన సభలో గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్‌ తన సుధీర్ఘ ప్రసంగంలో బీసీల ఊసే ఎత్తక పోవడం శోచనీయం అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రాష్ట్రంలో బీసీ వాదం పెరిగిపోయిందని, బీసీల్లో వచ్చిన చైతన్యం చూసిన కాంగ్రెస్‌ సర్కార్‌ తప్పని పరిస్థితుల్లో బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు చేస్తూ అసెంబ్లీలో చట్టం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ 18 నెలల పాలనలో ప్రతీ అంశం పై మాట్లాడిన కేసీఆర్‌ బీసీల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీ ప్రశ్నించిన కేసీఆర్‌ బీసీల హక్కులు, డిమాండ్ల పై ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీసీ బిల్లు అమలు పై  ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాల్సి ఉండాల్సిందన్నారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం న్యాయ నిపుణులతో చర్చించి బీసీ బిల్లు అమలు చేయడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నందున కేసీఆర్‌ తన వైఖరి స్పష్టం చేస్తే బీసీలు హర్షించేవారని తెలిపారు. బీసీ బిల్లును గవర్నర్‌ వద్దకు పంపకుండా కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్న ప్రభుత్వం పై వివమర్శనాస్త్రాలు సంధిస్తే బీసీల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగేదన్నారు. బీహార్, తమిళనాడు ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధాన ప్రక్రియను ఇక్కడ కూడా పాటించాలని ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందన్నారు.  తమిళనాడులో రిజర్వేషన్లు పెంచినప్పుడు బిల్లులు పాస్ చేయడానికి చట్టాలు చేసినప్పుడు మొదట జీవోలు జారీ చేసి ఉద్యోగాలు భర్తీ చేశారు. తర్వాత కొందరు కోర్టు కు పోయినప్పుడు సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టివేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చి సవరణ చేసేలా కేంద్రం పై ఒత్తిడి తేవాలని సూచిస్తే బీసీలు బీఆర్‌ఎస్‌ను ఆదరించేవారని, బీసీల ప్రస్తావన లేక పోవడంతో బీసీలు ఆగ్రహంగా ఉన్నట్లు గుజ్జ సత్యం తెలిపారు.