NewsPolitics

ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలి – గుజ్జ సత్యం 

ఇందిరా పార్కు వద్ద ధర్నా…

సత్యతెలంగాణ హైదరాబాద్, అక్టోబర్ 26 : ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను అమ్మవద్దని కోరుతూ ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ హాస్టళ్లకు అద్దె బకాయిలను చెల్లించాలని సత్యం డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ ప్రభుత్వం చెల్లించే వరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఉద్య మాన్ని దశల వారీగా ఉద్ధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కాలరాస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు రూ. 8158 కోట్లు వెంటనే చెల్లించాలని  డిమాండ్ చేశారు.  ముఖ్యమైన స్కాలర్ షిప్, ఫీజు బకాయిల స్కీమును ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. విద్య రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఎస్సీ ఎస్టీ, బీసీల అభివృద్ధికి ఉపయోగపడే ఈ స్కీమును ప్రభుత్వం ఉద్దేశాపూర్వకంగా నీరుగారుస్తుందని విమర్శించారు. అనేక స్కీములకు లక్షల కోట్ల అప్పు తెస్తున్న ప్రభుత్వం లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ పథకం కు ఒక రూ. 6000 కోట్లు అప్పు తెస్తే ఎవరు అడ్డుకుంటారని ప్రశ్నించారు. పైగా ఈ పథకం కు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో 20 రూపాయలు కూడా విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.