డిగ్రీ పరీక్షలు నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతకానితనం – గుజ్జ సత్యం

హైదరాబాద్, మే 5, 2025: తెలంగాణ రాష్ట్రంలో రీయింబర్స్‌మెంట్ జాప్యం వల్ల డిగ్రీ పరీక్షలు జరగకపోవడం విద్యార్థుల జీవితాల్లో తీవ్ర గందరగోళాన్ని, అస్థిరతను తీసుకువచ్చిందని ,ఇది విద్యావ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, చేతగానితనాన్ని తెలియజేస్తుందని జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జసత్యం విమర్శించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 800 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని, ఈ బకాయిల వల్ల ప్రత్యక్షంగా 6 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు కాలేకపోతున్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా ప్రభుత్వం పూర్తిస్థాయిలో రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడం వల్ల పలు డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కళాశాలలు ఆర్థికంగా కుదేలయ్యాయి. 2023-24 సంవత్సరానికి మాత్రమే గాను సుమారు 350 కోట్ల రూపాయలు విడిపించాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 120 కోట్లు మాత్రమే విడుదల చేయబడ్డాయి. చాలాచోట్ల కళాశాలలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా వెనక్కి పంపుతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు.
పరీక్షల షెడ్యూల్ నిర్దేశించడంలో, ఫీజు జాప్య నివారణలో ప్రభుత్వం విఫలమవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం తక్షణం మిగిలిన రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి, పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. లేకపోతే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున విద్యార్థుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.