NewsPolitics

స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లుపై జీవో జారీ చేసి ఎలక్షన్ల నోటిఫికేషన్ ఇవ్వండి.

  • జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
సమావేశంలో మాట్లాడుతున్న గుజ్జ సత్యం

హైదరాబాద్, జులై 7 (సత్య తెలంగాణ): స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వం జీవో జారీ చేసి ఎలక్షన్ల నోటిఫికేషన్ ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి పంపించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుకుందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా ఆ పని చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై నెట్టి వేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయడం లేదనే నేపం నెట్టి సుప్రీంకోర్టుకు వెళ్తాము అంటూ బీసీలను మోసం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. అఖిల పక్షాన్ని, బీసీ సంఘాలను కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లాలని ప్రతి రోజూ బీసీ సంఘాలు కోరుతున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్తాం అంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తన పరిధిలో ఉన్న అంశాన్ని కేంద్రంపై, సుప్రీంకోర్టుపై నెట్టి ఎవరిని మోసం చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని అన్నారు. బీసీలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను పరిగణలోకి తీసుకుని ఉద్యమాలను మరింత ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది లేదని ఆయన అన్నారు. గ్రామ స్థాయి నుంచే బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసే విధంగా బీసీ సంఘాల, కుల సంఘాల నేతలు కృషి చేయాలని ఆయన కోరారు.