42 శాతం బీసీ రిజర్వేషన్లను కాపాడే న్యాయ పోరాటానికి సిద్ధం – ఆర్. కృష్ణయ్య

సత్య తెలంగాణ హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణలో బీసీ సమాజానికి 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ GO ని రక్షించుకునేందుకు, జాతీయ బీసీ సంఘం చట్టపరమైన పోరాటానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల కేసులో 30కి పైగా బీసీ సంఘాలు హైకోర్టులో ఇంప్లెడ్ కేసులు వేసినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లంపల్లి రామకోటి, రామ్మూర్తి గౌడ్, సి. రాజేందర్, అనంతయ్య, చెరుకు మణికంఠ, నీల వెంకటేష్, పగిళ్ళ సతీష్, భాస్కర్ ప్రజాపతి, జగదీష్, తదితర బీసీ సంఘాల నేతలు కేసులు వేయడం జరిగిందన్నారు. రాజ్యాంగంలోని 243-D6 ఆర్టికల్ ప్రకారం సంస్థలలో స్థానిక బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం అధికారం ఇచ్చిందని, దీంతో అసెంబ్లీలో ప్రభుత్వం చట్టం చేశారని వారు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు పెంచినప్పుడు 50శాతం సీలింగ్ ఎత్తిశారని తెలిపారు. ఇందిరా సహానీ కేసులో ఎంపరికల్ డాటా ఉంటే 50శాతం సీలింగ్ను అధిగమించవచ్చునని సుప్రీంకోర్టు అభిప్రాయం కూడా ఉందన్నారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ “బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాజ్యాంగబద్ధ హక్కు. ఇది రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాల సాధనకు కీలకం. బీసీ జనాభా రాష్ట్ర మొత్తం జనాభాలో 50 శాతం దాటింది. అయినా, వారిని అణగదొక్కే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందుకే చట్టపరమైన, ప్రజా పోరాటం రెండింటినీ మేము కొనసాగిస్తాము,” అని అన్నారు.
“ప్రజల మద్దతుతో ఈ రిజర్వేషన్లను కాపాడతాం. ఎవరైనా బీసీల హక్కులను తగ్గించే ప్రయత్నం చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అని కృష్ణయ్య హెచ్చరించారు.