19న ఛలో పార్లమెంట్ – 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి – జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

హైదరాబాద్,మార్చి13 (సత్య తెలంగాణ): తెలంగాణ బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరుతూ ఈ నెల 19వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తెలిపారు. గురువారం కాచిగూడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో అఖిలపక్ష ఎంపీల మద్దతు కూడగట్టడానికి ఛలో పార్లమెంట్ ను 19వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చట్టసభలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, విద్య, ఉద్యోగాలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని అన్నారు. జాతీయ స్థాయిలో ఓబీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యుస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో బీసీలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి కేంద్రప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు.