కేంద్ర గెజిట్ లో కులగణన ప్రస్తావన ఎందుకు లేదు?జనగణనలో కుల గణన పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి – గుజ్జ సత్యం

హైదరాబాద్, జూన్ (సత్య తెలంగాణ): జనగణనలో కుల గణన పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనగణన గెజిట్ నోటిఫికేషన్‌లో కుల గణనపై స్పష్టత లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం సోమవారం (జూన్ 16, 2025) విడుదల చేసిన 2027 జనగణన గెజిట్ నోటిఫికేషన్‌లో కుల గణనకు సంబంధించిన స్పష్టమైన వివరణ లేకపోవడం బీసీలను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 30, 2025న జనగణనలో కుల గణనను చేర్చాలని నిర్ణయించినప్పటికీ, ఈ నోటిఫికేషన్‌లో ఆ విషయం గురించి స్పష్టత లేకపోవడం బీసీ సంఘాల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉందన్నారు.
“కుల గణన అనేది బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో న్యాయమైన ప్రాతినిధ్యం మరియు అవకాశాలను సాధించడానికి కీలకమైన అంశం. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలకు విరుద్ధంగా, ఈ గెజిట్ నోటిఫికేషన్‌లో కుల గణనపై స్పష్టమైన ప్రస్తావన లేకపోవడం నిరాశాజనకం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సమగ్ర కుల గణన ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో, కేంద్రం కూడా ఇలాంటి సమగ్ర విధానాన్ని అనుసరించాలని కోరారు. ఈ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వాన్ని 2027 జనగణనలో కుల గణన ఖచ్చితంగా చేర్చబడుతుందా? కుల గణన సేకరణ పద్ధతులు, డేటా బహిర్గతం, మరియు దాని ఆధారంగా రిజర్వేషన్ల అమలు విధానం ఏమిటి? వంటి అంశాలపై
కేంద్రం తక్షణమే స్పష్టత ఇవ్వాలని, బీసీల హక్కులను కాపాడేందుకు రాజ్యాంగబద్ధమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.